calender_icon.png 26 December, 2024 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైబ్రీడ్‌కే మొగ్గు

20-12-2024 12:33:49 AM

  1. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీపై స్పష్టత
  2. పంతం నెగ్గించుకున్న బీసీసీఐ
  3. 2024-27 మధ్య ఐసీసీ ఈవెంట్లన్నీ తటస్థ వేదికల్లో
  4. పీసీబీకి ఐసీసీ హామీ

దుబాయ్: వచ్చే ఏడాది జరగనున్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహ ణకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఈ మెగా టోర్నీని హైబ్రీడ్ పద్దతిలో నిర్వహించేందుకే ఐసీసీ మొగ్గుచూపింది. పాక్‌లో ఆడేది లేదంటూ కుండబద్ధలు కొట్టిన బీసీసీఐ తమ పంతం నెగ్గించుకుంది. పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికల్లో జరగనున్నాయి. టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని ఐసీసీ పేర్కొంది.

అయితే 2024 వరకు ఉపఖండంలో జరగనున్న అన్ని ఐసీసీ ఈవెం ట్లు హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించాలని పట్టుబట్టిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణ యాన్ని గౌరవించిన ఐసీసీ దానికి ఒప్పుకుం ది. ఫలితంగా కర్ర విరగదు పాము చావదు అన్న చందంగా ఇరుజట్ల బోర్డులకు సమన్యాయం చేసినట్లయింది. 

చైర్మన్‌గా జై షా మార్క్..

ఐసీసీ నూతన చైర్మన్‌గా జై షా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే చాంపి యన్స్ ట్రోఫీ జరుగుతుందా లేదా అన్న అనిశ్చితికి తెరపడడం విశేషం. 2008 ముంబై ఉగ్రదాడుల అనంతరం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పటినుంచి ఐసీసీ టోర్నీల్లో మినహా రెండు జట్ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జరగనున్న చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుందని తెలుసుకున్న బీసీసీఐ పాక్‌లో ఆడేదే లేదని.. హైబ్రీడ్ అయితే ఓకే అని లేదంటే టోర్నీ నుంచి తప్పుకుంటామని స్పష్టం చేసింది. అయితే పీసీబీ కూడా ఏమాత్రం తగ్గలేదు.

పాకిస్థాన్ సహా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పరిధిలోనూ ట్రోఫీ టూర్ ప్రదర్శనకు కూడా సిద్ధమైంది. ఈ అంశం ముదిరి పాకాన పడకముందే ఒక కొలిక్కి తీసుకురావాలని ఐసీసీ భావించింది. ఈ నెల 5న దుబాయ్ వేదికగా ఐసీసీ, బీసీసీఐ, పీసీబీ మధ్య ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో భారత్ హైబ్రీడ్ మోడ్ అయితే ఆడేందుకు సిద్ధమని చెప్పగా.. ఇకపై భారత్‌లో జరిగే ఐసీసీ టోర్నీల్లో తమ మ్యాచ్‌ల న్నీ తటస్థ వేదికల్లో ఆడేందుకు అంగీకరిస్తేనే చాంపియన్స్ ట్రోఫీ ఆడతామని పీసీబీ కూడా తేల్చిచెప్పింది.

దీనిపై సుదీర్ఘంగా చర్చించిన ఐసీసీ పీసీబీ ప్రతిపాదనకు ఒప్పుకుంది. 2025 మహిళల వన్డే ప్రపంచకప్,  2026 పురుషుల టీ20 ప్రపంచకప్ టోర్నీ ల్లో పాక్ తమ మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికల్లో ఆడనుంది. 2028 టీ20 ప్రపంచకప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుండగా.. ఈ టోర్నీకి కూడా హైబ్రీడ్ మోడ్ వర్తిస్తుందని ఐసీసీ తెలిపింది.