కాంగ్రెస్ అసలు రంగు ఇదే
- అబద్ధపు హామీలతో అధికారంలోకి రావడం
- వాటిని అమలు చేయలేక ప్రజలను దగా చేయడం
- విరుచుకుపడిన ప్రధాని నరేంద్రమోదీ
న్యూఢిల్లీ, నవంబర్ 2: ఎన్నికల ప్రచారంలో ఇష్టారీతిన అడ్డగోలు వాగ్దానాలు చేయడం సులభమని, కానీ వాటిని అమలు చేయడం ఎంత అసాధ్యమో కాంగ్రెస్‌కు ఇప్పుడు అర్థమవు తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మండిపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయలేక ఇబ్బందులు పడుతున్నాయని ఆరో పించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని హామీలు ఇవ్వాలని ఇటీవల కాంగ్రెస్ చీఫ్‌లకు ఏఐసీసీ అధినేత మల్లికార్జున చేసిన సూచనలపై ఈ మేరకు మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఎన్నికల ప్రచారాల్లో కాంగ్రెస్ మళ్లీ మళ్లీ అవే బూటకపు వాగ్దానాలు చేస్తుంది. అవి ఎప్పటికీ అమలు చేయ డం సాధ్యం కాదని తెలిసినా కాంగ్రెస్ అదే చేస్తుంది. ఇప్పుడు వాళ్ల సంగతేంటో ప్రజలకు తెలిసింది. కాంగ్రెస్ అసలు రంగు బయటపడింది అని ప్రధాని ధ్వజమెత్తారు.
ప్రజలను మోసగించడమే..
ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రాన్నైనా తీసుకోండి. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో అభివృద్ధి, ఆర్థికంగా బలహీనపడుతున్నాయి. అక్కడి పరిస్థితులు అధ్వాన్నంగా మారుతున్నాయి. వారు ఇచ్చిన బూటకపు హామీలు నెరవేర్చడం లేదు. ఇది నమ్మి ఓట్లేసిన ప్రజలను ఘోరంగా మోసగించడమే అని ప్రధాని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ అబద్ధాలకు పేదలు, యువత, రైతులు, మహిళలు బాధితులుగా మిగులుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను సైతం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు నెరవేర్చకపోవడం దురదృష్టకరమని అన్నారు.
తెలంగాణలో రైతుల పడిగాపులు
కర్ణాటకలో అభివృద్ధి మీద కాకుండా పార్టీలోని అంతర్గత తగాదాలు, దోపిడీపైనే అక్కడి ప్రభుత్వం దృష్టి పెట్టిందని మోదీ ధ్వజమెత్తారు. అంతేకాకుండా అమలు చేస్తున్న పథకాలను కూడా వెనక్కి తీసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఉద్యోగులకు జీతాలు సకాలంలో చెల్లించడం లేదు. తెలంగాణ విషయానికి వస్తే రుణమాఫీ కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. గతంలో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో ఇచ్చిన అనేక హామీలను ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ నెరవేర్చలేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాల గురించి చెప్పాలంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని అన్నారు.
కాంగ్రెస్ పట్ల జాగ్రత్త
ఈ సందర్భంగా కాంగ్రెస్ బూటకపు వాగ్దానాల పరంపర పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్ధాలను నమ్మకుండా స్థిరమైన, ప్రగతి పథంలో నడిచే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం చూశాం. కాంగ్రెస్‌కు ఓటు వేయడ మంటే పాలన రహిత, ఆర్థిక బలహీనత, విచ్చలవిడి దోపిడీకి దారి చూపినట్టేనని ప్రజలకు అర్థమైంది. ఈ రోజుల్లో భారత ప్రజలు అభివృద్ధి, ప్రగతిని కోరుకుంటున్నారు. అదే పాత చింతకాయ పచ్చడి లాంటి బోగస్ హామీల కోసం చూడటంలేదు అని మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఖర్గే చెప్పింది రాహుల్‌కేనా: రవిశంకర్
రాష్ట్రాల కాంగ్రెస్ చీఫ్‌లకు ఖర్గే చేసిన సూచనలపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ రవిశంకర్‌ప్రసాద్ విమర్శలు గుప్పించారు. బడ్జెట్‌ను అనుసరించి హామీలి వ్వాలని ఖర్గే ఇప్పుడు చెబుతున్నారు. ఇది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ఉద్దేశించే చెప్పారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. హిమాచల్‌లో రాహుల్ అనేక వాగ్దానాలు చేశారు. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేలు కూడా జీతాలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కర్ణాటక, తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా రాష్ట్రాల ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చినందుకు ఖర్గే, రాహుల్ క్షమాపణలు చెప్పాలి. ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్‌లోనూ ఇలాగే బూటకపు హామీలు ఇస్తోందని, ఇలాంటి వాగ్దానాలు చేయడం ఇప్పటికైనా కాంగ్రెస్ మానుకోవాలి. కిసాన్ సమ్మాన్, 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్, డిజిటల్ ఇండియా వాగ్దానాలను మోదీ ప్రభుత్వం నెరవేర్చింది అని ప్రసాద్ గుర్తుచేశారు.
అచ్ఛే దిన్ ఎక్కడ? ఖర్గే
కాంగ్రెస్‌పై మోదీ వ్యాఖ్యలకు ఖర్గే ఎక్స్ వేదికగానే కౌంటర్ ఇచ్చారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, అచ్ఛేదిన్‌ను సృష్టిస్తానని మోదీ చేసిన వాగ్దానాన్ని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వమంటే అబద్ధాలు, మోసం, నకిలీ, దోపిడీ, పబ్లిసిటీ అనే ఐదు అంశాలు గుర్తుకొస్తాయని విమర్శించారు. బీజేపీలో బీ అంటే దగా (బీట్రాయల్), జే అంటే జుమ్లా (డొల్ల వాగ్దానం) అని ఎద్దేవా చేశారు.
మోదీ విమర్శలు హాస్యాస్పదం
తప్పుదారి పట్టించడం, నెరవేర్చలేని వాగ్దానాలు చేయడంలో పేరు తెచ్చుకున్న బీజేపీ సంక్షేమంలో అసాధారణ ట్రాక్ రికార్డ్ ఉన్న కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. కర్ణాటకలో తామిచ్చిన హామీలను అమలు చేశామని, ఎవరైనా పరిశీలించవచ్చని సవాలు చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలు తప్పని ఖండించారు.
హిమాచల్ సీఎం సుఖ్విందర్‌సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించామని, మహిళలకు నెలకు రూ.1,500 భత్యం ఇస్తున్నామని, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లకు స్టార్టప్ ఫండ్ కింద రూ.680 కోట్లు కేటాయించామని చెప్పారు. ఎన్నికల్లో తామిచ్చిన 10 గ్యారెంటీల్లో ఐదింటిని ఇప్పటికే అమల్లోకి తెచ్చినట్లు చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వానిదే రికార్డు
- సూర్యుడిలా వెలిగిపోతుంది
- మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పథకం రూ.10 లక్షల వరకు పెంపు అమలు
- సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్
హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానం నేరవేర్చే విషయంలో తమ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని, బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే తమదే రికార్డు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన విమర్శలకు రేవంత్‌రెడ్డి శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి బీఆర్‌ఎస్ హయాంలో నెలకొన్న చీకటి, నిరాశను పారదోలుతున్నామని, తమ పాలనలో తెలంగాణ ఉదయిస్తున్న సూ ర్యుడిలా వెలుగులీనుతోందని చెప్పారు. ‘ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలను స్వీకరించిన రెండు రోజుల్లోనే ఆర్టీసీ బస్సు ల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం ప్రారంభించింది. ఇప్పటివరకు 101 కోట్ల మంది మహిళలు సద్వినియోగం చేసుకున్నారు.
మహిళలు రూ. 3,433.36 కోట్లను ఆదా చేసుకున్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల సదుపాయాన్ని అమల్లోకి తీసుకొచ్చాం. ఏడాది కాలంలోపే 22.22 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేశాం. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. గ్యాస్ సిలిండర్‌పై రూ. 500 సబ్సిడీ ఇస్తున్నాం.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న ధరలతో పోలిస్తే తెలంగాణలో గ్యాస్ సిలిండర్‌ను తక్కువకే ఇస్తు న్నాం. ఇప్పటివరకు 1.31 కోట్లకు పైగా గ్యాస్ సిలిండర్ రీ ఫిల్లింగ్స్ జరిగాయి. 42,90,246 మంది లబ్ధి పొందారు. అన్ని పోటీ పరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తున్నాం. 11 నెలల్లోనే 50 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టాం. నియామకాల్లోనూ ఏ బీజేపీ పాలిత రాష్టంతో పోల్చినా మాదే రికార్డు’ అని సీఎం వెల్లడించారు.
మూసీ పునరుజ్జీవానికి కట్టుబడినం
మూసీ పునరుజ్జీవానికి నడుం బిగించామని, నదిని శుభ్రం చేసి పూర్వ వైభం తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గత పదేళ్లలో అక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, నాలాలను పరిరక్షించే చర్యలు చేపట్టామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురి కాలేదని చెప్పారు. ప్యూచర్ సిటీకి మాస్టర్ ప్లాన్ ఖరారు చేస్తున్నామని, స్కిల్ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.