calender_icon.png 2 April, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్య గొంతుకోసి చంపిన భర్త

01-04-2025 01:55:51 AM

  1. నల్లగొండ జిల్లాలో దారుణం
  2. మద్యం మత్తులో ఘాతుకం
  3. గుర్రంపోడు మండలం తెరాటిగూడెంలో ఘటన 

గుర్రంపోడు, మార్చి 31 : నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. తాగుడుకు బానిసై మద్యం మత్తులో భార్యను అతి కిరాతంగా భర్త గొంతుకోసి హతమార్చాడు. గుర్రంపోడు మండలం తెరాటిగూడెంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలివి.. గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన దూపెల్లి కిరణ్ అదే మండలం కొప్పోలు గ్రామానికి చెందిన అరుణ( 42) పదిహేనేండ్ల క్రితం ప్రేమ వివాహం  చేసుకున్నారు.

వీరికి మూడేండ్ల కుమారుడున్నారు. దంపతులిద్దరికీ తల్లిదండ్రులు లేకపోవడంతో బతుకుదెరువుకు ఐదేండ్ల క్రితం అరుణ అమ్మమ్మ ఊరైన తెరాటిగూడెం వచ్చి నివాసం ఉంటున్నారు. స్థానికంగా కిరాణ దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కిరణ్ మద్యానికి బానిసకావడంతో దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.

సోమవారం మధ్యాహ్నం సైతం కిరణ్ పూటుగా మద్యం తాగి రావడంతో భార్య అరుణ నిలదీయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కాసేపు బయటకు వెళ్లి వచ్చిన కిరణ్ ఇంటికి రాగానే మద్యం మత్తులో భార్యతో మరోమారు గొడవకు దిగాడు.

విచక్షణ కోల్పోయి వెంట తెచ్చుకున్న కత్తితో భార్య గొంతు కోశాడు. దీంతో ఆమె విలవిలలాడుతూ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఘటనాస్థలం నుంచి కిరణ్ పరారయ్యాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.