నిజామాబాద్, సెప్టెంబర్ 01 (విజయక్రాంతి): భార్య కాపురానికి రాకపోవడంతో ఆత్మహత్యకు ప్రయత్నించిన భర్త చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నందిపేట్ ఎస్సై హరిబాబు తెలిపిన ప్రకారం.. నందిపేట్ మండలం కుద్వాన్‌పూర్‌కు చెందిన సుకృత్ (22) ఏడాది క్రితం రజిత అనే యువతిని ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. కొంతకాలం తరువాత వీరి మధ్య గొడవలు రావడంతో వేరుగా ఉంటున్నారు. దీంతో వీరికి నందిపేట్ పీఎస్‌లో పోలీసులు శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కాపురానికి వెళ్లేందుకు రజిత నిరాకరించింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సుకృత్ స్టేషన్ ఆవరణలోనే కలుపు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న స్థానికులు అడ్డుకుని నందిపేట్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి అతని కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుకృత్ ఆదివారం మృతి చెందాడు.