calender_icon.png 16 April, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

15-04-2025 12:53:29 AM

అడ్డువచ్చిన అత్తపై దాడి 

పటాన్ చెరు, ఏప్రిల్ 14 :పటాన్ చెరు మండలం పెద్దకంజర్ల గ్రామపంచాయతీ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను ఘోరంగా కడతేర్చాడు.  రోకలి బండతో బాది హత్యచేయడమే కాకుండా అడ్డువచ్చిన అత్త పై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.

వివరాల్లోకి వెళ్తే జిన్నారం మండలం కిష్టాయిపల్లికి చెందిన సురేష్ కు పెద్ద కంజర్లకు చెందిన రమీలతో ఐదేళ్ల కింద వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కూతురు సాత్విక ఉంది. భార్యభర్తల మధ్య మనస్పర్థలతో కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు. భార్య రమీల నెల రోజుల క్రితం నుంచి  పెద్ద కంజర్లలోని తన పుట్టింట్లో ఉంటుంది.

అయితే  గొడవలు పరిష్కరించుకోవడానికి మంగళవారం పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. ఈ క్రమంలో నిందితుడు సురేష్ సోమవారం పెద్ద కంజర్లలోని అత్తగారింటికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భార్య రమీల (25)ను భర్త సురేష్ రోకలి బండతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భార్య, భర్తల మధ్య  గొడవను ఆపేందుకు అడ్డు వెళ్లిన అత్త కవితపై సైతం అల్లుడు సురేష్ దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.

కవితను చికిత్స నిమిత్తం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  స్థానికుల ఫిర్యాదుతో పటాన్ చెరు సీఐ వినాయక్ రెడ్డి క్లూస్ టీం తో ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐతెలిపారు.