07-04-2025 12:33:01 PM
గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో ఘటన
గర్భవతి అని చూడకుండా అయిన బండరాయితో మోది చంపే యత్నం
శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): కట్టుకున్న భార్య గర్భిణీ అనికూడా చూడకుండా అతి కిరాతకంగా బండరాయితో దాడి చేసి చంపేందుకు యత్నించాడు ఓ భర్త. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్రకలకలం రేపుతోంది. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో ఈనెల 1న జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ కు చెందిన బస్రత్ (32) నగరానికి వలస వచ్చి హఫీజ్ పేట్ డివిజన్ ఆదిత్య నగర్ లో నివాసం ఉంటూ ఇంటీరియర్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2023 జనవరిలో అజ్మీర్ దర్గాకు వెళ్లే క్రమంలో రైల్వే ప్రయాణంలో కోల్ కత్తాకు చెందిన షబానా పర్వీన్ (22) పరిచయం అయింది. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి 2024 అక్టోబర్ నెలలో వివాహం చేసుకున్నారు.
హఫీజ్ పేట్ ఆదిత్య నగర్ లోనే ఉంటున్నారు. పర్వీన్ ఇటీవల గర్భం దాల్చింది. అయితే అనారోగ్య సమస్యలతో గత నెల 29వ తేదీన పర్వీన్ ను కొండాపూర్ లోని సియా లైఫ్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ కోలుకున్న ఆమెను 1వ తేదీన రాత్రి డిచార్జీ చేశారు. ఈ క్రమంలోనే భార్యాభర్తలు బస్రత్, పర్వీన్ లు బయటకు వస్తుండగా మాటా మాటా పెరిగింది. దీంతో ఆవేశంతో ఊగిపోయిన బస్రత్ దగ్గరలోని రాయితో పర్వీన్ తల పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. పలుమార్లు రాయితో తలపై బాధగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. చనిపోయిందని భావించిన బస్రత్ అక్కడి నుండి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలతో ఉన్న పర్వీన్ ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కోమాలో ఉన్న ఆమె ప్రాణాలతో పోరాడుతుంది. ఈ ఘటన పై కేసునమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు బస్రత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.