08-04-2025 12:28:18 AM
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 7: కట్టుకున్న భార్య, అందునా గర్భిణి అనికూడా చూడని ఓ భర్త ఆమెపై బండరాయితో దాడిచేసి చంపేందుకు యత్నించిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్‌కు చెందిన బస్రత్ (32) నగరానికి వలస వచ్చి హఫీజ్‌పేట్ డివిజన్ ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటూ ఇంటీరియర్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
2023 జనవరిలో అజ్మీర్ దర్గాకు వెళ్లే క్రమంలో రైల్వే ప్రయాణంలో కోల్‌కత్తాకు చెందిన షబానా పర్వీన్ (22) పరిచయం అయ్యింది. పరిచయం ప్రేమగా మారి 2024 అక్టోబర్ నెలలో వివాహం చేసుకుని, హఫీజ్‌పేట్ ఆదిత్యనగర్‌లోనే ఉం టున్నారు. పర్వీన్ ఇటీవల గర్భం దాల్చింది. అనారోగ్య సమస్యల కారణంగా గత నెల 29న పర్వీన్‌ను కొండాపూర్‌లోని సియా లైఫ్ ఆస్పత్రిలో చేర్పించారు.
కోలుకున్న ఆమెను ఈ నెల 1వ తేదీన రాత్రి డిశ్చార్జి చేశారు. ఈ క్రమంలోనే భార్య, భర్తలు ఆసుపత్రి నుంచి బయటకు వస్తుండగా మాటా మాటా పెరిగింది. దీంతో బస్రత్ బండరాయి తీసుకుని పర్వీన్ తలపై బాదడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. చనిపోయిందని భావించిన బస్రత్ అక్కడి నుంచి పారిపోయాడు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పర్వీన్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రసుత్తం కోమాలో ఉన్న ఆమె ప్రాణాలతో పోరాడుతున్నది. పోలీసులు బస్రత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.