calender_icon.png 26 October, 2024 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్యాభర్తలను ఒకే జిల్లాకు కేటాయించాలి

23-07-2024 01:39:01 AM

స్థానికత ఆధారంగా టీచర్లను సొంత జిల్లాలకు బదిలీ చేయాలి

క్యాబినెట్ సబ్ కమిటీకి పీఆర్టీయూటీఎస్ నేతల వినతి

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): 317 జీవో కారణంగా భార్య ఒక జిల్లాకు, భర్త మరొక జిల్లాకు బదిలీ అయ్యారని, ఇలా వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలను ఒకే జిల్లాకు కేటాయించాలని పీర్టీయూ టీఎస్ విజ్ఞప్తి చేసింది. 317 జీవో అమలు వల్ల ఏర్పడిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు దామోదర రాజనర్సింహా, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లకు వినతిపత్రం సమర్పించింది. స్థానికత ఆధారంగానే ఉపాధ్యాయులను వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని, సీనియారిటీ రక్షణ కల్పిస్తూ పరస్పర బదిలీలను అమలు చేయాలని కోరారు.

వివిధ జిల్లాల్లో ఏర్పడిన అసమానతలను తొలగిస్తూ కేడర్ స్ట్రెంగ్త్‌ను సరిచేయాలని, అనారోగ్య, వితంతు ప్రాధాన్యతలను గుర్తించాలన్నారు. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులను మంజూరు చేసి ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయా అంశాలను ప్రతిపాదనల రూపంలో ప్రభుత్వానికి సమర్పించి ఉత్తర్వులు విడుదల చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. మంత్రులను కలిసిన వారిలో ను పీఆర్టీయూ సంఘం అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి, కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రవీందర్ ఉన్నారు.