హోర్డింగ్ కూలి 8 మంది మృతి
న్యూఢిల్లీ, మే 13: ముంబైలో గాలి దుమారం, భారీ వర్షం బీభత్సం సృష్టించింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన గాలులకు తోడు భారీ వర్షం కురవడంతో ఘట్‌కోపర్ ప్రాంతంలో ఓ 100 అడుగుల భారీ హోర్డింగ్ రోడ్డుపై కూలింది. దీంతో రోడ్డుపై ప్రయాణిస్తున్న వారు దాని కింద పడి నలిగిపోయారు. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, 64 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం విపత్తు నిర్వహణ బృందాలు వెతుకుతున్నారు. ప్రమాదంలో పలు వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. కాగా, గాలి దుమారానికి చెత్తాచెదారం అన్ని దిశల్లో ఎగసిపడడంతో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. ముంబైలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని, స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.