* నగదు అపహరణ అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన దుండగులు
* అఫ్జల్‌గంజ్‌లోట్రావెల్స్ మేనేజర్‌పై దాడి.. పరార్
* పది ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17(విజయక్రాంతి): అఫ్జల్‌గంజ్‌లో ట్రావెల్స్ మేనేజర్‌పై గురువారం కాల్పులు జరిపిన ముఠా కోసం నగర పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఇలా కాల్పులకు తెగబడింది బీహార్‌కు చెందిన అమిత్‌కుమార్ ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. పది ప్రత్యేక బృందాలతో గురువారం రాత్రి నుంచి మూడు కమిషనరేట్ల పరిధిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం కూడా తనిఖీలు కొనసాగాయి. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, లాడ్జీలు, హోటళ్లలో సోదాలు నిర్వహించారు.
నిందితులు అప్జల్‌గంజ్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు ఆటోలో వెళ్లినట్లు సమాచారం. నిందితులు అడ్డదారుల్లో రాయ్‌పూర్, బీహార్‌కు పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠాలో అమిత్‌కుమార్ చాలా కీలకమైన వ్యక్తి అని, అతనిపై బీహార్‌లో దోపిడీ, దొంగతనం వంటి డజన్ల కొద్దీ కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయమై ఇప్పటికే బీహార్ పోలీసులతో హైదరాబాద్ పోలీసులు కాంటాక్ట్ అయినట్లు సమాచారం.
అంతా సినీ ఫక్కీలో..
గురువారం ఉదయం బీదర్ జిల్లా కేంద్రంలోని ఓ ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వెళ్తున్న ఇద్దరు సిబ్బందిపై దుండగులు జరిపిన కాల్పుల అనంతరం.. ఆ దొంగల ముఠా సాయంత్రానికి హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌కు పారిపోయేందుకు అఫ్జల్‌గంజ్‌లోని ఓ ట్రావెల్స్ బస్సులో టికెట్ బుక్‌చేసుకుని కూర్చున్నారు. వారి బ్యాగ్ తనిఖీ చేసేందుకు ప్రయత్నించిన మేనేజర్ జహంగీర్‌పై వారు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దుండగుల కాల్పుల్లో గాయపడ్డ జహంగీర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.