calender_icon.png 9 January, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష

31-12-2024 02:35:18 AM

* మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తా

* బీపీఎస్సీ పరీక్షను మళ్లీ నిర్వహించాలి

* జన్ సురాజ్ నేత ప్రశాంత్ కిషోర్

* ప్రశాంత్‌పై సహా 700 మందిపై కేసు

పాట్నా, డిసెంబర్ 30: పాట్నాలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జికి నిరసనగా జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు జన్ సురాజ్ నేత ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. బీపీఎస్సీ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈనెల 13న నిర్వహించిన బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్( బీపీఎస్సీ) ప్రిలిమినరీ ప్రశ్నాపత్రం లీకైనట్లు వార్తలు రావడంతో పరీక్షను రద్దు చేయాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు.

పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ పాట్నాలో ఆదివారం గాంధీ మైదాన్‌లో ఆందోళన చేశారు. ఈ క్రమంలో నిరుద్యోగులు సీఎం నితీశ్ ఇంటివైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరుద్యోగులను చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించి లాఠీఛార్జి చేశారు. నిరుద్యోగుల ఆందోళనకు ప్రశాంత్ కిషోర్ మద్దతు తెలిపారు. నిరుద్యోగులపై పోలీసుల లాఠీఛార్జిని ఆయన ఖండించారు. ఈ ఘటనపై కోర్టుతో పాటు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తానని ఆయన ప్రకటించారు. 

ప్రశాంత్ కిషోర్ నిలదీత..

 నిరుద్యోగులపై లాఠీఛార్జి జరుగుతున్న సమయంలో ఆ ప్రదేశం నుంచి  ప్రశాంత్ కిషోర్ వెళ్లిపోతున్నట్లుగా పలు వీడియోలు బయటకు వచ్చాయి. లాఠీఛార్జి తరువాత పరామర్శకు వచ్చిన ఆయనకు, నిరుద్యోగులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమపై లాఠీఛార్జి జరుగుతున్నప్పుడు అక్కడ ఉండకుండా ఎందుకు వెళ్లిపోయారని ఆయనను  నిరుద్యోగులు నిలదీశారు. ఆందోళన జరుగుతున్న ప్రాంతం నుంచి వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాగా తనపై నిరుద్యోగులు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. వారికి తన మద్దతు ఎప్పుడు ఉంటుందన్నారు. పోలీసులు లాఠీఛార్జి చేస్తుండడంతో అభ్యర్థులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పి తాను మరో చోటికి వెళ్లినట్లు ఆయన వెల్లడించారు. అయితే తాను వెళ్లిన 45 నిమిషాల తరువాత లాఠీఛార్జి జరిగిందని ఆయన తెలిపారు. 

ప్రశాంత్‌పై కేసు..

అభ్యర్థుల నిరసనకు ప్రశాంత్ కిషోర్ మద్దతు తెలిపి వారిని రెచ్చగొట్టారని పోలీసులు ఆరోపించారు. ర్యాలీలకు, నిరసన లకు అనుమతి లేకున్నా అభ్యర్థులను ఆ యన రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘా తం కలిగించేలా ప్రేరేపించారని పోలీసులు పేర్కొన్నారు. దీంతో ప్రశాంత్ కిషో ర్, కోచింగ్ సెంటర్ల యజమానులు, 700 మంది నిరసనకారులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే కొంతమంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.