calender_icon.png 11 January, 2025 | 1:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనాలోనూ 100 డేస్!

20-12-2024 12:00:00 AM

‘మల్లీశ్వరి’ చిత్రం బీఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన తెలుగు చిత్రం. టాలీవుడ్ చరిత్రలో ప్రముఖంగా చెప్పుకునే సినిమాల్లో ఖ్యాతికెక్కిందీ చిత్రం. 1951, డిసెంబర్ 20న విడుదలైన ఈ సినిమాలో నందమూరి తారక రామారావు, భానుమతి నాయకానాయికలు. అప్పట్లో భారతదేశంలోనే కాక ఇతర దేశ్లాలోనూ ప్రదర్శితమైంది. రాచరికపు ఆడంబరాలను, ఆచారాలను ఆధారంగా చేసుకొని రూపొందించిన ఈ సినిమా గురించి చెప్పుకోదగ్గ విషయమేమంటే.. కమ్యూనిస్టు దేశమైన చైనాలోనే వంద రోజులకుపైగా ఆడటం! విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలన నేపథ్యంలో నడుస్తుందీ చిత్ర కథ.

మల్లిక (చిన్నప్పుడు బేబీ మల్లిక, పెద్దయ్యాక భానుమతి), నాగరాజు (చిన్నప్పుడు మాస్టర్ వెంకట రమణ, పెద్దయ్యాక ఎన్టీఆర్) బావామరదళ్లు. నాగరాజు శిల్పి కాగా, మల్లిక గాయని. ఈ ఇద్దరు బావామరదళ్లు శ్రీకృష్ణదేవరాయలు, ఆస్థాన కవి బృందానికి ఎలా చేరవయ్యారు. మల్లి (మల్లీశ్వరి) రాణివాసానికి ఎలా చేరింది? అంతఃపుర నిబంధనల ప్రకారం బావామరదళ్లు నాగరాజు ఎలాంటి విరహ వేదనకు గురయ్యారు? మల్లీశ్వరి కోసం నాగరాజు చేసిన సాహసాలేంటి? చివరకు ఈ ప్రేమకథ ఏ గూటికి చేరింది? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

బుచ్చిబాబు రాసిన ‘రాయలకరుణకృత్యం’ నాటికను దేవులపల్లి కృష్ణశాస్త్రి అభివృద్ధి చేసిన స్క్రిప్ట్ ‘మల్లీశ్వరి’ సినిమాగా రూపుదిద్దుకుంది. ఇందులోని మాటలు, పాటలు, కళ, నటన, సంగీతం, ఛాయాగ్రహణం, ఎడిటింగ్‌తో సహా అన్నీ తానై నడిపించారు బీఎన్ రెడ్డి. అందుకే కృష్ణశాస్త్రి ఒక సందర్భంలో “మళ్లీశ్వరి’ సృష్టిలో మేమంతా నిమిత్తమాత్రులం. బీఎన్‌రెడ్డి గారు దీనికి సర్వస్వం” అన్నారు.