calender_icon.png 1 November, 2024 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుణెలో 100 బైక్‌ల చోరీ

16-07-2024 12:44:32 AM

  • చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు 
  • వ్యవసాయ కార్మికుల వేషధారణలో గ్రామస్తులతో కలిసిపోయి ఆపరేషన్

మాహారాష్ట్ర (పుణె), జూలై 15: పుణెలో వరుస బైక్ దొంగతనాలను ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు చాకచక్యంగా 100 బైక్‌లను రికవరీ చేయడంతో పాటు నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బైక్‌ల రికవరీకి సంబంధించి వారు నిర్వహించిన ఆపరేషన్‌కు సంబం ధించి వివరాలను పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పుణె పరిసర ప్రాంతాల్లో  గతేడాది బైక్ చోరీలకు సంబంధించి స్థానిక ఠాణాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న పుణె క్రైంబ్రాంచ్ పోలీసు ఉన్నతాధికారులు.. ఏడుగురు పోలీసులతో ఒక టీంను ఏర్పాటు చేశారు. ఆ టీం సభ్యులు గతేడాది ధరాశివ్ జిల్లాలోని కళ్లం తాలూకాలోని ఒక గ్రామంలో మార్చి ఒకనెలపాటు సీక్రెట్ ఆపరేషన్‌ను నిర్వహించారు.

    ముందుగా వారంతా వ్యవసాయ కార్మికుల వేషధారణలో అక్కడివారితో కలిసిపోయి నివసించడం ప్రారంభించారు. తమనుతాము పొరుగు జిల్లాకు చెంది న వ్యవసాయ కూలీలుగా పరిచయం చేసుకొని సెకెండ్ హ్యాండ్ బైక్‌ల క్రయ, విక్రయాల గురించి స్థానికుల నుంచి ఆరాతీయడం ప్రారంభించారు. ఈ క్రమంలో దొంగలించిన బైక్‌లను ముఠా సభ్యులు.. వారాంతపు సంతలు, జాతరల్లో రూ.25వేల నుంచి రూ.35వేల వరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఉన్నతాధి కారుల సూచన మేరకు ఏప్రిల్ 19, 2023న దొంగిలించబడిన బైక్‌లను విక్రయిస్తున్న గోవింద్‌పూర్‌కు చెందిన యువరాజ్, పరమేశ్వర్‌ను ఆ బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టకొని అరెస్టు చేసింది.

    తదుపరి విచారణలో నిందితుల అనుచరులు అజయ్ రమేష్ షిండే, సచిన్ ప్రదీప్‌ను అరెస్టు చేశారు. ఈ ముఠాకు షిండే సూత్రధారి అని విచారణలో తేలింది. కాగా షిండే ఓ ప్రైవేట్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేశాడని, తదనంతరం ఓ దొంగల ముఠాను ఏర్పాటుచేసకొని బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. తదనంతరం అనేక బృందాలు ధరాశివ్, బీడ్, లాథూర్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి దాదాపు రూ.34 లక్షల విలువైన 100 బైక్‌లను రికవరీ చేసింది.