calender_icon.png 21 January, 2025 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినయ సంపద

02-10-2024 12:00:00 AM

పాలకుర్తి రామమూర్తి :

కృతకః స్వాభావికశ్చ వినయః

క్రియా హి ద్రవ్యం వినయతి నాద్రవ్యమ్

శుశ్రూషా శ్రవణ గ్రహణ ధారణ 

విజ్ఞానోహాపోహ తత్త్వాభినివిష్టబుద్ధిం 

విద్యా వినయతి, నేతరమ్!

- కౌటిలీయం:- 1---5-2

“వ్యక్తిలో వినయం రెండు విధాలుగా వ్యక్తమవుతుంది. మొదటిది ‘కృతకం’. అంటే అసహజమైంది లేదా ప్రయత్న పూర్వకంగా సాధించింది. రెండవది స్వాభావికం. క్రియ అంటే శిక్షణ, ద్రవ్యాన్ని (స్వభావాన్ని) సంస్కరిస్తుందే కాని ద్రవ్యం కాని దానిని సంస్కరించదు” అంటాడు ఆచార్య చాణక్య. “శిక్షణవల్ల సహజంగా యోగ్యత గలిగిన వ్యక్తి సంస్కరింప బడతాడే కాని అయోగ్యునికి శిక్షణవల్ల ఉపయోగం ఉండదు.

ఉదా॥కు సానబట్టడం వల్ల వజ్రం మెరుస్తుందే కాని మట్టిబెడ్డకు మెరుపు రాదు” అంటారాయన. యోగ్యతను సాధించేందుకు కావలసిన అర్హతలు.. శుశ్రూష (సేవా భావన), శ్రవణం (పూర్తి శ్రద్ధతో వినడం), గ్రహణం (చెప్పేవారి ఆంతర్యాన్ని గ్రహించడం), ధారణ (విన్న దానిని జ్ఞాపకం పెట్టుకోవడం), విజ్ఞానం (సాధ్యాసాధ్యాలను, యుక్తాయుక్తాలను వివేచన చేయడం), ఊహ (అస్పష్టంగా ఉన్న దానిని హేతుబద్ధంగా  తెలుసుకోవడం), అపోహ (హేతుబద్ధత కాని దానిని విడిచి పెట్టడం), తత్త్వాభినివిష్టబుద్ధి (సత్యాన్ని తెలుసుకోవాలనే పట్టుదల).. ఇవి ఉన్నవారికే వినయం ఉపకరిస్తుంది కాని, ఇతరులకు ఉపయోగపడదు. వినయమనేది ఇక్కడ శిక్షణగా భావించాలి. 

ఒక సంస్థలో వివిధ విభాగాల నిర్వహణకై ఎలాంటి అధికారులను నియమించుకొని వారికి అవసరమైన శిక్షణను ఇవ్వవచ్చో చెపుతున్నారు చాణక్య. అభ్యర్థులకు కష్టించి పనిచేసే తత్త్వం ఉండాలి. అలాగే, నేర్చుకోవాలనే తపన అంతశ్చేతనను దహించివేయాలి. మనోద్వారాలు పూర్తిగా తెరిచి ఉండాలి. తాము నేర్చిన జ్ఞానానికి పెద్దల అనుభవ జ్ఞానాన్ని జోడిస్తూ పరిణామం చెందేందుకు వారు సన్నద్ధులై ఉండాలి. 

ప్రభావవంతంగా వినే లక్షణం వారిలో ఉండాలి. వినడంలో ఆలోచన ఉంటుంది. ‘తన నుంచి చెప్పేవారు కోరుతున్నదేమిటి?’ అనేది అర్థం చేసుకోవడమే ప్రభావవంతంగా వినడం. వినడం కూడా ఐదు రకాలు. చెపుతున్న దానిని పట్టించుకోక పోవడం, వింటున్నట్లు నటించడం, అవసరమైన వాటిని మాత్రమే వినడం, శ్రద్ధతో వినడం, చెప్పేవారి భావనతో మమేకమై వినడం. ఇందులో చివరిదే గ్రహణంగా చెప్పవచ్చు. విన్న దానిని అవసరానికి ఉపయోగించగలగడమే ధారణ. 

సామర్థ్యానికి నిబద్ధత తోడవాలి

పరిస్థితులను విభిన్న కోణాలలో విశ్లేషించడం విజ్ఞానం. సకారాత్మక, నకారాత్మక ఆలోచనలు, సహేతుకమైన, సృజనాత్మక ఆలోచనలు, లోతుగా, విభిన్న పార్శ్వాలలో చేసే ఆలోచనలు, యుక్తాయుక్త ఆలోచనలు యాజమాన్య నిర్వహణలో అవసరమవుతాయి.

అలాగే, అస్పష్టత అలుముకొన్న సమయంలో ఊహలతో దానిని సమన్వయం చేసుకోవడమే కాక ఎక్కడైతే అసంబద్ధత చోటు చేసుకుంటుందో దానిని తిరస్కరించే స్థయిర్యమూ కావాలి. ఇతరుల అభిప్రాయాలను గౌరవించినా తన ఆలోచనలను నిర్దిష్టంగా, నిర్దుష్టంగా అమలు చేసే ఓర్పు, నేర్పు కలిగివుండాలి.

యాజమాన్య నిర్వహణలో తనకంటూ స్పష్టమైన దార్శనికత కావాలి. కార్యాచరణలో ప్రత్యేకమైన విధానం ఉండాలి. సత్యాసత్యాలపై అవగాహన కుదరాలి. వ్యక్తులు కాదు, వ్యవస్థ ముఖ్యమైంది. సమస్యల పరిష్కారంలో వ్యక్తుల ఇష్టాయిష్టాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోగలిగిన సాహసం కావాలి. సునిశితమైన ధీపటిమ కావాలి. జాగ్రత్తగా సత్యాన్వేషణ చేయగలిగిన ధైర్యంతోపాటు అభ్యుదయానికి మార్గాలను అన్వేషించే విధానం తెలియాలి.

కొందరికి ఈ లక్షణాలు స్వతహాగా రావచ్చు. కాని, మరి కొందరు వాటిని శిక్షణద్వారా సంతరించుకుంటారు. సహజమైంది సామర్థ్యం, శిక్షణద్వారా వచ్చేది నిబద్ధత. సామర్థ్యానికి నిబద్ధత తోడైతే కార్య సాధన సఫలమవుతుంది.

ఇక్కడ శిక్షణనిచ్చే శిక్షకుని ప్రామాణ్యత, నేర్చుకునే అభ్యాసి  జిజ్ఞాస సరైనవైతే సరైన ఫలితాలు ఆవిష్కారమవుతాయి. అలాంటి విద్యా వినయాలు కలిగిన వారిని నిర్వాహకులుగా నియమించుకుంటే వివిధ విభాగాల వ్యవహారాలు సుగమమవుతాయి. పై లక్షణాలు లేని వ్యక్తులు అధికారులైతే సంస్థ నిర్వీర్యమవుతుంది.