calender_icon.png 9 March, 2025 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవీయ మహాశిఖరం

23-02-2025 12:00:00 AM

నేడు గాడ్గీ మహరాజ్ జయంతి :

గ్రామాలలో శుచీ శుభ్రతను సాధించడమే లక్ష్యంగా స్వ చ్ఛ వాతావర ణాన్ని కాంక్షించే బృహత్ లక్ష్యా నికి నేటి ప్రధాని మోదీనే కాదు, ఆనాటి అంబేద్కర్‌కు ప్రత్యక్షంగా, మహాత్మాగాంధీకి పరోక్షంగా స్ఫూర్తిప్రదాతగా నిలిచిన మహానుభావుడు గాడ్గే మహరాజ్.

అశుచి, అశుభ్రతలను చూస్తే దగ్గరికి రాకుండా దూరం జరిగే వారే ఎక్కువగా కనిపించే ఆధునిక సమాజంలో ఏకంగా చీపురు పట్టుకొని స్వయంగా వీథులు ఊడ్చే సాహ సం ఎవరు చేస్తారు? ఎంతో విశ్వజనీన మానవీయ హృదయం ఉంటే తప్ప అంత గొప్ప పనికి ఎవరైనా ఉపక్రమించరు. సంఘ సంస్కరణలలో అసాధారణ రీతిలో అంబేద్కర్‌కు మార్గనిర్దేశనంగా నిలవడమే కాక బాపూజీలో ఏకంగా ‘చీపురు టాయిలెట్స్ శుభ్రం’ చేసే స్థాయి గొప్ప కార్యానికి ప్రేరణగా నిలిచిన గాడ్గే మహరాజ్ గురించి ఈతరం వారికి అంతగా తెలియదు.

ఈ విషయంలో ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, గాంధీ, అంబేద్కర్‌ల అద్భుత కృషి తెలిసినంతగా గాడ్గే త్యాగనిష్ఠ గురించి తెలియక పోవడం భారతీయుల దురదృష్టం. అంతటి సంస్కర్త గాడ్గే మహరాజ్ జయంతి నేడు. ఇప్పటికీ దేశంలోని అనేక గ్రామాలు అపరిశుభ్రతకు నిలయాలుగా ఉన్న నేపథ్యంలో గాడ్గే మహరాజ్ జీవితాన్ని ప్రజలకు ఆదర్శంగా తెలియజెప్పవలసిన అవసరం ప్రభుత్వాలపై నేటికీ ఎంతైనా ఉంది.

1876 ఫిబ్రవరి 23న మహారాష్ట్రలోని అమరావతి జిల్లా అంజన్‌గావ్ తాలూకా షేన్‌గావ్ గ్రామంలోని ఒక రజక కుటుంబంలో జన్మించిన గాడ్గే అసలు పేరు దేవీదాస్ దేబూజీ. వీరి తల్లిదండ్రులు జింగ్రాజీ, సక్కుబాయిలు. తండ్రి చిన్నతనంలోనే మద్యపానానికి బానిసై మరణించడంతో దేబూజీ మేనమామ ఇంట్లో పెరిగారు. పశువులను మేపుకుంటూ కూడా ఆశ్చర్యకరంగా భజన మండళ్లలో కీర్తనలు, పాటలు పాడేవారు.

చీపురు పట్టుకొని ఊరూరు తిరుగుతూ, వీథులు ఊడ్చుతూ శుభ్రం చేసేవారు. ఒక షావుకారు తన ఆస్తిని లాక్కోవాలని చూసినప్పుడు స్వయంగా ఒక్కడే ఎదిరించారు. పరిస్థితుల ప్రభావంతో 29వ ఏట 1904 ఫిబ్రవరి 5న సిద్ధార్థుడి వలె భార్యాపిల్లలను విడిచిపెట్టి వెళ్లి, సన్యాసం స్వీకరించారు. తర్వాత కూడా వీధులు ఊడ్వడం మానలేదు. మరాఠీలో మట్టిమూకుడును ‘గాడ్గే’ అం టారు.

దానిని తలపై పెట్టుకుని, చీపురు చేతపట్టి తిరిగేవారు కనుక, కాలక్రమంలో ఆయనను ‘గాడ్గే మహరాజ్’ లేదా ‘గాడ్గే బాబా’ అని పిలిచేవారు. “నాది అంటరాని కులం” అని చెబుతూ వారు పడే బాధలన్నీ స్వయంగా అనుభవించారు. కులవివక్షపై ఆనాడే నిర్విరామ పోరాటం సలిపారు. ప్రజ లు తనకు దానంగా ఇచ్చిన సొమ్మును కూడా వారి కోసమే వెచ్చించాడు. అంతఃశుద్ధితోపాటు బాహ్య పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యమన్న సందేశాన్నిచ్చిన గాడ్గే మహరాజ్ 1956 డిసెంబర్ 20న కన్నుమూశారు. 

 సహర్ష