calender_icon.png 23 December, 2024 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంటకలిసిన మానవత్వం

23-12-2024 02:37:57 AM

మర్కూక్ వైకుంఠధామంలో నాయీబ్రాహ్మణ వృద్ధురాలి అంత్యక్రియలను అడ్డుకున్న అగ్రవర్ణ కులాల ప్రజలు

గత్యంతరం లేక మరోచోట దహనానికి బదులు ఖననం చేసిన బంధువులు 

సెలూన్లు బంద్ చేసి నిరసన తెలిపిన నాయీబ్రాహ్మణులు

గజ్వేల్, డిసెంబర్22: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ పరిధిలోని మర్కూక్ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. వివరాలు.. మర్కూక్ గ్రా మంలో శుక్రవారం రాత్రి నాయీబ్రాహ్మణ కులానికి చెందిన లింగంపల్లి ఎల్లమ్మ(84) అనారోగ్యంతో మృతి చెందింది. శనివారం కుటుంబసభ్యులు, కులస్తులు ఎల్లమ్మ మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి తమకు చెందిన స్థలానికి వెళ్లగా ఆ పక్కనే భూమిని కొనుగోలు చేసిన వ్యకి.. తన స్థలం పక్కన అంత్యక్రియలు చేస్తే తన భూమిని కొనుగోలు చేయడానికి ఎవరూ రారని చెప్పడం తో చేసేది లేక ప్రభుత్వం నిర్మించిన వైకుంఠధామంలో అంత్యక్రియలు చేయడానికి వెళ్లారు.

అక్కడ గ్రామానికి చెందిన అగ్రవర్ణాల ప్రజలు ఎల్లమ్మ మృతదేహానికి అంత్య క్రియలు చేయడానికి ఒప్పుకోకపోవడంతో అసంపూర్తిగా నిలిచిపోయిన మరో వైకుంఠధామంలో అంత్యక్రియలు చేయడానికి ఎల్లమ్మ కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఇందుకు కూడా గ్రామస్తులు ఒప్పుకోకపోవడంతో చేసేది లేక గ్రామంలోని పెద్దచెరువు భూమిలో ఎల్లమ్మ మృతదేహానికి.. దహనానికి బదులు ఖననం చేశారు.

తమ కులానికి చెందిన ఓ వృద్ధురాలి అంత్యక్రియలు చేయకుండా అడ్డుపడిన గ్రామస్తుల ఇండ్లలో ఇక నుంచి ఎలాంటి శుభ, అశుభ కార్యక్రమాలకు తాము సహకరించమని మర్కూక్‌లోని నాయీబ్రాహ్మణులు తేల్చిచెప్పారు. ఘటనకు నిరసనగా ఆదివారం మర్కూక్‌లోని సెలూన్లను మూసివేసి బంద్ పాటించారు.