calender_icon.png 30 September, 2024 | 11:51 AM

స్కూల్‌లో బాలుని నరబలి

28-09-2024 01:45:11 AM

యూపీలో దారుణం

మూఢనమ్మకాలతో స్కూల్ యాజమాన్యం కిరాతకం

పాఠశాల విజయవంతంగా నడవాలని క్షుద్రపూజ

లక్నో, సెప్టెంబర్ 27: మూఢనమ్మకాలపై అవగాహన కల్పించి సమాజంలో మార్పు తీసుకురావాల్సిన ఉపాధ్యాయులు దారుణానికి పాల్పడ్డారు. తమ ప్రైవేట్ స్కూల్ సుదీర్ఘకాలం నడవాలని ఓ పసివాడిని నరబలి ఇచ్చిన ఘటన యూపీలోని హాథ్రస్‌లో జరిగింది. అదే పాఠశాలలో రెండో తరగతి బాలుడిని యాజమాన్యమే దగ్గురుండి బలిచ్చారు.

వివరాలు.. హాథ్రస్‌లోని డీఎల్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం స్కూల్ సక్సెస్ కోసం క్షుద్రపూజలు నిర్వహించారు. ఈ పూజలో భాగంగా స్కూల్ హాస్టల్‌లో ఉండే రెండో తరగతి విద్యార్థి కృతార్థ్ (11)ను సోమవారం నరబలి ఇచ్చింది. అదేరోజు బాలుడి తండ్రికి యాజమాన్యం ఫోన్ చేసి కృతార్థ్ అనారోగ్యానికి గురయ్యాడని, కారులో డైరెక్టర్ ఆసుపత్రికి తీసుకెళ్లాడని సిబ్బంది చెప్పినట్లు అతను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించాడు.

తర్వాత కారులో తన కుమారుడి మృతదేహం కనిపించిందని చెప్పగా.. పోలీసులు దర్యాప్తులో అసలు నిజాలు తేల్చారు. తొలుత బావి వద్ద చంపాలని భావించినప్పటికీ బాలుడు భయంతో కేకలు వేయడంతో హాస్టల్‌లోనే గొంతునులిమి హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు.

నిందితులు సెప్టెంబర్ 6న 9 ఏళ్ల మరో విద్యార్థిని బలి ఇచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పాఠశాల యజమాని జశోధన్‌సింగ్, డైరెక్టర్ దినేశ్ బాఘేల్, ముగ్గురు టీచర్లను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.