calender_icon.png 11 February, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారుల నిర్లక్ష్యమే కూలీల ప్రాణం తీసింది

10-02-2025 09:40:55 AM

గోవర్ధనగిరి ఘటనపై మానవహక్కుల వేదిక నిజనిర్ధారణ

హుస్నాబాద్,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో గత నెల 30న జరిగిన ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని మానవహక్కుల వేదిక తేల్చింది. ఉపాధి పనులు చేస్తుండగా, మట్టిపెళ్లలు, బండరాళ్లు కూలి ఇద్దరు కూలీలు మృతిచెందడమే కాకుండా మరో ఐదుగురు కూలీలు గాయపడడానికి భద్రతా ప్రమాణాల లోపమేనని అభిప్రాయ పడింది. ఆదివారం ఆ  వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పందిల్ల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యులు గ్రామంలో ప్రమాదం జరిగిన సంజీవరాయగుట్ట వద్ద ఉన్న స్పాట్ కు వచ్చి నిజనిర్ధారణ చేశారు.

ప్రమాదంలో మృతిచెందిన తల్లీకూతుర్లు కాందారపు సరోజన (58), అన్నాజి మమత (35) కుటుంబ సభ్యులతోపాటు గాయపడిన వలబోజు మనెమ్మ, ఇంద్రాల స్వరూప, ఇంద్రాల రేణుక, తాటికొండ విమల, గౌడ వెంకటయ్యను కలిసి వివరాలు తెలుసుకున్నారు. పనులు చేస్తున్న గుట్ట వద్ద భద్రతా ప్రమాణాల అసమర్థ నిర్వహణే ఈ ప్రమాదానికి కారణమని తేలిందన్నారు. పని మేనేజర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగిందని కమిటీ అభిప్రాయపడింది. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, మృతుల కుటుంబాలకు తక్షణమే కేంద్ర ప్రభుత్వ పరిహారంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం  రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది.

బలవంతంగా భూములు గుంజుకుంటున్నరు

అనంతరం కమిటీ సభ్యులు అక్కన్నపేట మండలం చౌటపల్లిలో ఇండస్ట్రియల్ పార్కు కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూములను పరిశీలించారు. చౌటపల్లి, తోటపల్లి, జనగామ శివారులో 124 ఎకరాల భూములు కోల్పోతున్న బాధితులతో మాట్లాడారు. పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం బలవంతంగా భూములు గుంజుకుంటోందని  రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వారి హక్కులకు అభిప్రాయాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం సరికాదని, వందలాది మంది చిన్న, సన్నకారు రైతుల జీవనాధారం అయిన భూములను బలవంతంగా గుంజుకోవాలనుకోవడం ప్రజావ్యతిరేక చర్య అని అని మానవ హక్కుల వేదిక సభ్యులు అన్నారు.

భూసేకరణ తక్షణమే నిలిపివేయాలని, రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని,  వ్యవసాయ భూములకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను పరిశీలించాలన్నారు. గ్రామ ప్రజలతో సమగ్రంగా చర్చించకుండా భూములను స్వాధీనం చేసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు "భూమి రైతుల హక్కు – దానిని బలవంతంగా స్వాధీనం చేసుకోవడం అప్రజాస్వామిక చర్య" అని మానవ హక్కుల వేదిక స్పష్టం చేసింది. ఈ కమిటీలో ఆ వేదిక సభ్యులు కొయ్యడ కొమరయ్య, ముక్కెర సంపత్, ఎగ్గోజు సుదర్శన చారి, కన్నూరి సదానందం, సమ్మెట అచ్యుత్, కొంటు రాజేందర్, ఇంజం చైతన్య తదితరులున్నారు.