15-03-2025 01:02:25 AM
సహాయక చర్యలకు అడ్డంకిగా సాంకేతిక సమస్య
డేంజర్ జోన్ వద్దకు చేరిన రెస్క్యూ ఆపరేషన్
నాగర్‌కర్నూల్, మార్చి 14 (విజయక్రాంతి): శ్రీశైలం ఎడమ గట్టు సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకోగా రెస్క్యూ బృందాలు ఒకరి మృతదేహాన్ని మాత్రమే గుర్తించగలిగాయి. మిగతా ఏడుగురి కార్మికుల ఆచూకీ కోసం సుమారు 21 రోజులుగా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 14 రకాల రెస్క్యూ బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నా ఫలితం దక్కలేదు.
దాదాపుగా మానవ ప్రయత్నం పూర్తి చేసినట్లుగా రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి. డీనూ ప్రదేశం నుంచి సుమారు 20 మీటర్ల ప్రాంతంలో ఉన్న డీనూ వద్దే కార్మికుల ఆనవాళ్లు ఉన్నట్లుగా అనుమానిస్తూ తవ్వకాలు జరుపుతున్నారు. కానీ ఆ ప్రాంతంలో ప్రమాదకర స్థాయిలో నీటి ఊటతో పాటు మట్టి బురద జారి పడుతుండటంతో ఏఐ టెక్నాలజీ ద్వారా రోబో యంత్రాలను వినియోగించి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలని నిర్ణయించారు.
కానీ సాంకేతిక కారణాల వల్ల రెండు టన్నెల్ లోపలికి చేరిన రోబో యంత్రాలు అందుబాటులోకి రాలేకపోతున్నాయి. శుక్రవారం వాక్యూమ్ క్లీనర్ లాంటి పని విధానంతో ఉన్న రోబో కోసం 30 హెచ్‌పీ సామర్థ్యంగల పంపు మోటార్లు టన్నెల్ వద్దకు చేర్చారు. ప్రస్తుతం మాస్టర్ రోబో ద్వారా ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
వాక్యూమ్ ట్యాంకు ద్వారా వచ్చిన మట్టిని గంటకు 620 క్యూబిక్ మీటర్ల బురదతో కూడిన మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
డేంజర్ జోన్ ప్రాంతంలో సింగరేణి సహాయక బృందాలు టైగర్ కారడ్స్ అనే విధానంతో భారీగా కలప దుంగలను ఏర్పాటు చేసి పైకప్పు నుంచి మట్టి బురద జారిపడకుండా ముందస్తు ఏర్పాట్లు చేశాయి. 520 మందికి పైగా నిర్విరామంగా పని చేస్తున్నప్పటికీ డేంజర్ జోన్ డీనూ ప్రాంతంలో మాత్రం రెస్క్యూ బృందాలు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి.