calender_icon.png 26 October, 2024 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌యూఎల్ లాభం 2,595 కోట్లు

24-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనీలీవర్ (హెచ్‌యూఎల్) సెప్టెంబర్‌తో ముగిసిన క్యూ2లో రూ. 2,595 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాన్ని ఆర్జించింది. పట్టణ ప్రాంతాల్లో కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గడంతో నిరుడు ఇదేకాలంలో నమోదుచేసిన రూ. 2,657 కోట్లతో పోలిస్తే లాభం 2.33 శాతం క్షీణించింది.

సమీక్షా త్రైమాసికంలో సర్ఫ్, రిన్, లక్స్, పాండ్స్, లైఫ్‌బాయ్, లాక్మే, బ్రూక్‌బాండ్, లిప్టన్, హార్లిక్స్ తదితర బ్రాండ్ ఉత్పత్తులను విక్రయించే హెచ్‌యూఎల్ అమ్మకాలు మాత్రం 2.36 శాతం వృద్ధితో రూ. 15,340 కోట్ల నుంచి రూ. రూ.15,703 కోట్లకు పెరిగింది.

సెప్టెంబర్ త్రైమాసికంలో నగరాల్లో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల డిమాండ్ నెమ్మదించిందని, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం డిమాండ్ రికవరీ అవుతున్నదని, ఈ నేపథ్యంలో కంపెనీ లాభదాయకమైన పనితీరునే కనపర్చిందని హెచ్‌యూఎల్ సీఈవో రోహిత్ జావా చెప్పారు. రుతుపవనాలు, ఉపాధి కల్పన, ఆహార ద్రవ్యోల్బణం తదితర అంశాలు రానున్న రోజుల్లో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల డిమాండ్‌ను నిర్దేశిస్తాయన్నారు.

తమ అమ్మకాల్లో మూడింట రెండు వంతులు పట్టణ ప్రాంతాల్లోనే జరుగుతాయన్నారు. ద్రవ్యోల్బణంకంటే వేతనాల పెంపుదల తక్కువగా ఉన్నందున, గ్రామీణ ప్రాంతాల్లో వ్యయపరిచే సామర్థ్యం తక్కువగా ఉంటున్నదని హెచ్‌యూఎల్ సీఈవో వివరించారు. 

మొత్తం డివిడెండు షేరుకు రూ. 29

బుధవారం సమావేశమైన హెచ్‌యూఎల్ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ. 19 చొప్పున మధ్యంతర డివిడెండును సిఫార్సుచేసింది. దీనికి తోడు మరో రూ. 10 చొప్పున ప్రత్యేక డివిడెండునూ ప్రకటించింది. మొత్తం రూ. 29 చొప్పున డివిడెండును కంపెనీ చెల్లిస్తుంది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌యూఎల్ షేరు బీఎస్‌ఈలో స్వల్ప తగ్గుదలతో రూ. 2,658 వద్ద ముగిసింది.