న్యూఢిల్లీ, జనవరి 22: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనీలీవర్ (హెచ్‌యూఎల్) నికరరలాభం 2024 అక్టోబర్ క్యూ3లో 19.18 శాతం పెరిగి రూ. 2,989 కోట్లకు చేరింది. గత ఏడాది క్యూ3లో కంపెనీ రూ. 2,508 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ఆర్జించింది.
ప్యూర్‌ఇట్ వ్యాపారాన్ని విక్రయించినందున తమ నికరలాభం ప్రధానంగా పెరగడానికి కారణమని బుధవారం హెచ్‌యూఎల్ తెలిపింది. కంపెనీ కన్సాలిడేటెడ్ మొత్తం ఆదాయం రూ. 15,781 కోట్ల నుంచి రూ. 26,050 కోట్లకు పెరిగింది. ప్యూర్‌ఇట్‌తో కంపెనీ రూ. 507 కోట్ల అసాధారణ లాభాన్ని ఆర్జించింది. ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులకు పట్టణాల్లో డిమాండ్ తగ్గుతున్నదని, గ్రామీణ ప్రాంతాల్లో కోలుకుంటున్నదని హెచ్‌యూఎల్ సీఈవో రోహిత్ జావా చెప్పారు.
రూ.2,670 కోట్లకు మినిమలిస్ట్ కొనుగోలు
ప్రీమియం బ్యూటీ బ్రాండ్ మినమలిస్ట్ యాజమాన్య సంస్థ అయిన అప్‌రైజింగ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 90.5 శాతం వాటాను రూ. 2,670 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు హెచ్‌యూఎల్ వెల్లడించింది. ఈ సంస్థకు రూ. 2,955 కోట్ల విలుకట్టి వాటా కొన్నట్లు తెలిపింది.
ఐస్‌క్రీమ్ వ్యాపారం విభజన
హెచ్‌యూఎల్ తన క్వాలిటీవాల్స్ ఇండియా ఐస్‌క్రీమ్ వ్యాపారాన్ని విభజించేందుకు బుధవారం కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. హెచ్‌యూఎల్ షేర్‌హోల్డర్లకు ప్రతీ ఒక్క షేరుకూ ఒక క్వాలిటీవాల్స్ ఇండియా ఈక్విటీ షేరును కేటాయిస్తారు. విభజన పూర్తయిన తర్వాత క్యాలిటీవాల్స్ షేర్లను స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ చేస్తారు.