calender_icon.png 24 October, 2024 | 6:01 AM

సిద్దిపేటలో భారీగా పట్టుబడిన స్క్రాప్ వాహనాలు

24-10-2024 01:23:29 AM

  1. మొయినాబాద్ పీఎస్‌లో వేలం.. వ్యాపారి వెల్లడి
  2. గుంటూరుకు చెందిన వ్యాపారి కొనుగోలు ? 
  3. సిద్దిపేటకు తరలించడంలో అనుమానాలు

సిద్దిపేట, అక్టోబర్ 23 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో స్క్రాప్ వాహనాలను భారీ సంఖ్యలో సిద్దిపేట టూటౌన్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు, ఆర్టీవో వాహనాలను పరిశీలించి ఆరా తీశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో వేలం ద్వారా వీటిని ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన లైసెన్స్‌డ్ స్క్రాప్ వ్యాపారి కొనుగోలు చేశారని తెలిపారు.

అయితే వాటిని వ్యాపారి సొంత గోదాంలోనే తుక్కు గా మార్చి ఐరన్‌ని మాత్రమే విక్రయించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. సుమారు 12 వేలకు పైగా ఉన్న స్క్రాప్ వాహనాలను అడ్డ్డదారిన సిద్దిపేటకు తరలించారు. గుంటూరు వ్యాపారి నుంచి హైదరాబాద్‌కు చెందిన ఓ మధ్యవర్తి కొనుగోలు చేసి వాటిని సిద్దిపేటకు చెందిన స్క్రాప్ వ్యాపారికి విక్రయించినట్లు తెలిసింది.  

12వేలకు పైగా వాహనాలు 

12 వ్యాన్లలోని స్క్రాప్ వాహనాలను సిద్దిపేటలో పట్టుకున్న టూటౌన్ పోలీసులు  ఆర్టీవో అధికారులకు సమాచారం ఇచ్చారు. రెండు శాఖల అధికారులు వాహనాలను పరిశీలించి సమాచారం సేకరించారు. అనంతరం అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పకుండా మాట దాటవేశారు.

అయితే ఇలాంటి వాహనాలను కొనుగోలు చేసిన వ్యాపారి వాటిని తుక్కుగా మార్చి ఆ వాహనాల రిజిష్టర్ నంబర్లను తిరిగి ఆ పోలీసు స్టేషన్‌కు అప్పగించాల్సి ఉంటుంది. కానీ   వాహనాల విడి భాగాలను వ్యాపారులు పలు మోకానిక్‌లకు విక్రయించి సొమ్ము చేసుకుంటారు. దీంతో వాహనాలు ప్రమాదాలకు గురైనప్పుడు అసలు ఓనర్‌పై కేసు నమోదవుతుంది. పోలీసులు కేసు నమోదు చేయకుండా కాలయాపన చేయడం వెనుక మతలబు ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 

నంబర్లను స్టేషన్‌లో అప్పగించాలి..

కొత్త   వాహన చట్టం ప్రకారం వేలంలో స్క్రాప్‌ను లైసెన్సు కలిగిన వ్యాపారి మాత్రమే కొనుగోలు చేయాలని సిద్దిపేట డీటీవో కొండల్ రావు చెప్పారు. ఆ వ్యాపారి మాత్ర మే వాటిని తుక్కుగా మార్చి, రిజిస్టర్ నంబర్లను సంబంధిత స్టేషన్‌లో అప్పగించాల్సి ఉంటుందని తెలిపారు.

కాగా, వాహనాలు పట్టుకున్నది వాస్తవమేనని  సిద్దిపేట టూటౌ న్ సీఐ ఉపేందర్ అన్నారు. హైదారాబాద్‌లోని ఏఆర్ పోలీసుల వేలం ద్వారా కొనుగో లు చేసినట్లు అక్కడి పోలీసు అధికారులు ధృవీకరించారన్నారు. పూర్తిస్థాయి పత్రాలు పరిశీలించాక తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.