అధ్యక్షుడిగా ఎన్నికవడంతో కేసులపై విచారణ వాయిదా
వాషింగ్టన్, నవంబర్ 9: నాలుగేండ్ల నాటి ఎన్నికల కేసుల నుంచి అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌నకు భారీ ఉపశమనం లభించింది. 2020 అధ్యక్ష ఎన్నికల తరువాత చెలరేగిన హింసకు కారకుడయ్యాడని ట్రంప్‌పై కేసులు నమోదయ్యాయి.
ఈక్రమంలో 2024లో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడంతో అమెరికా న్యాయశాఖ చట్టాల ప్రకారం అధ్యక్షుడికి క్రిమినల్ విచారణ నుంచి మినహాయింపు రక్షణ ఉంటుంది.
అంతేకాక అధ్యక్షుడిని క్రిమినల్ కేసుల్లో ప్రాసిక్యూట్ చేయడం కుదరదు. మరికొన్ని రోజుల్లో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్న నేపథ్యంలో 2020 నాటి ఎన్నికల కేసుపై నిర్ణయం తీసుకునేందుకు గడువు పెంచాలని స్పెషల్ కౌన్సిల్ న్యాయమూర్తి జాక్ స్మిత్‌ను ఫెడరల్ ప్రాసిక్యూటర్లు కోరారు.
దీంతో కేసుల విచారణ పెండింగ్ డెడ్‌లైన్స్‌ను పక్కనబెడుతూ కేసు విచారణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు న్యాయమూర్తి జాక్ స్మిత్ ఆదేశాలిచ్చారు. దీంతో ట్రంప్‌పై ఉన్న కేసుల దర్యాప్తు ఆగిపోతుంది.
2020 ఎన్నికల్లో బైడెన్ గెలిచిన తరువాత జరిగిన హింసాత్మక ఘటనలను ట్రంప్ ప్రోత్సాహించారని ఆరోపణలు రావడంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి.అంతేకాక ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ట్రంప్ ప్రయత్నించారని అభియోగాలు వచ్చాయి. అలాగే పోర్న్ స్టార్ స్టార్మ్‌కు హష్‌మనీ కేసులో ట్రంప్ దోషిగా తేలడంతో ఈ నెల 26న న్యూయార్క్ కోర్టు శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. ఇది కూడా వాయిదా పడనుంది.
స్మిత్‌పై వేటు?
అయితే స్పెషల్ కౌన్సిల్ న్యాయమూర్తి జాక్ స్మిత్‌పై అధ్యక్ష హోదాలో ట్రంప్ వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. జాక్‌ను తొలగించి తనపై నమోదైన కేసులకు ముగింపు పలకాలని భావిస్తున్నట్లు ట్రంప్ ఇంతకుముందే ప్రకటించారు. దీంతో ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకునే వరకు ఎటువంటి పరిణామాలు జరుగుతాయోనని అమెరికన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భారతీయుల్లో ట్రంప్ భయం!
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏం చేస్తారోనని వలసదారులంతా భయపడుతున్నా రు. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు తమ పిల్లల భవిష్యత్‌పై ప్రభావం చూపుతాయేమోనని భారతీయ అమెరికన్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వేరే దేశాల్లో పుట్టి అమెరికా పౌరసత్వం కోసం ఆరాటపడే వారి ఆశల మీద ట్రంప్ నిర్ణయాలు నీళ్లు చల్లుతాయని అంతా భావిస్తున్నారు. ఇలా ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికా పౌరసత్వం తీసుకునే వారిని అడ్డుకుంటామని ట్రంప్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు.
పని మొదలు..
వేరే దేశాల నుంచి వచ్చి అమెరికా పౌరసత్వం తీసుకునే వారిని అడ్డుకుంటామని డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో చెప్పిన విధంగానే అటు వైపు చర్యలకు పూనుకున్నారు. మొదటి రోజు నుంచే ఇమ్మిగ్రేషన్ సమస్యల మీద అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఫోకస్ చేశారు. అమెరికాలోకి అక్రమంగా వలస వచ్చే వారిని చట్టబద్ధంగా వెనక్కి పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
3౦౦ బిలియన్లకు మస్క్ సంపద
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రం ప్ విజయం సాధించడం టెస్లా అధినేతకు బాగా కలిసొచ్చింది. మస్క్‌కు టెస్లా తోపాటు స్పేస్‌ఎక్స్, న్యూరాలింక్ తదితర ప్రసిద్ధ ఆరు కంపెనీలు ఉన్నాయి. ట్రంప్ గెలవడానికి మస్క్ తీవ్రంగా కృషి చేశారు. అంతేకాక ప్రచారం కోసం భారీ మొత్తంలో విరాళాలు అందజేసి ట్రంప్‌నకు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటి ంచారు.
తాను అధ్యక్షుడిగా గెలిస్తే మస్క్‌కు పదవి ఇస్తానని ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ విజయం సాధించడంతో మస్క్‌కు అమెరికాలో భారీగా ఆదరణ పెరిగి ఆయనకు చెందిన కంపెనీల షేర్లు జోరందుకున్నాయి. స్టాక్ మార్కెట్‌లో షేర్లు దూసుకుపోవడంతో మస్క్ సంపద భారీగా పెరిగినట్లు బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ తెలిపింది.
మంగళవారం ఫలితాలు వెలువడగానే ఎలాన్‌కు చెందిన టెస్లా కంపెనీ స్టాక్స్ దాదాపు 28 శాతం పెరిగినట్లు పేర్కొన్నది. దీంతో ఆయన సంపద 50 బిలియన్లు పెరిగి 300 బిలియన్ డాలర్ల నుంచి 313.7 బిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్లడించింది. 2022 జనవరిలో 340.4 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్న ఒకే ఒక్కడిగా మస్క్ నిలిచాడని బ్లూమ్‌బర్గ్ పేర్కొన్నది.
తిరిగి 2024 డిసెంబర్ నాటికి ఆ స్థాయికి మస్క్ చేరుకున్నారని తెలిపింది. 230 బిలియన్ డాలర్లతో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ రెండో స్థానంలో, 209 బిలియన్ డాలర్లతో మార్క్ జుకర్‌బర్గ్ మూడో స్థానంలో ఉన్నట్టు నివేదిక తెలిపింది.