calender_icon.png 22 November, 2024 | 1:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత థీమ్‌తో 25న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ

22-11-2024 02:15:59 AM

అదే రోజు 8,143 మంది గ్రూప్ అభ్యర్థులకు నియామక పత్రాలు

హైదరాబాద్, నవంబర్ 21 (విజయ క్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఏడాది కావస్తుంది. అందులో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రజాపాలన విజయోత్సవాల పేరిట వేడుకలను కూడా ప్రారంభించింది. ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సంకల్పించింది.

ఇప్పటికే వరంగల్ జిల్లాలో మహిళలకు ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందు పెట్టేందుకు మహిళా థీమ్‌తో భారీ బహిరంగ సభను నిర్వహించింది. తెలంగాణ ఆడపడుచుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని సభ ద్వారా వెల్లడించింది. భారీ సంఖ్యలో మహిళలు హాజరు కావడంతో సభ విజయవంతమైంది.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన యువతపై ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా యువత థీమ్‌తో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 25న బహిరంగ సభ నిర్వహణకు కరీంనగర్ జిల్లాను ఎంపిక చేసింది.

రాష్ట్రంలోని నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు సరైన ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకునే దిశగా చర్యలు చేపట్టింది. ఈ సభ ద్వారా ఏడాది కాంగ్రెస్ పాలనలో చేపట్టిన నియామకాలపై యువతలో విస్తృతంగా ప్రచారం చేయాలనుకుంటున్నది. ఇప్పటికే వివిధ శాఖల పరిధిలో వేలాది ఉద్యోగాలను భర్తీ చేసి కాంగ్రెస్‌పై యువతకు నమ్మకం కలిగేలా చర్యలు తీసుకుంది. 

8,143 మందికి నియామక పత్రాలు...

కరీంనగర్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో యువత పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక చొరవను వెల్లడించనున్నది. అదే రోజు 8,143 పోస్టులకు ఎంపికైన గ్రూప్-4 అభ్యర్థులకు నియామకపత్రాలను అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే గ్రూప్ అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవడంతో ఈ సభ వేదికగా వారికి నియామక పత్రాలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నది.

కాగా ప్రభుత్వం ఇప్పటికే పలు శాఖల్లో ఉన్న వేలాది ఖాళీలను భర్తీచేసింది. ఆయా శాఖల్లో కలిపి మొత్తం 45,167 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించింది. ప్రస్తుతం భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్న గ్రూప్ ఉద్యోగాలతో కలిపితే మొత్తం 53,310 ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ సభ ద్వారా యువతకు హామీ ఇచ్చి, నెరవేర్చిన ఉద్యోగాల భర్తీ గురించి వివరించి వారిని మరింత ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. 

ఏడాదిలో చేపట్టిన నియామకాలు..

శాఖ ఉద్యోగాల సంఖ్య

వ్యవసాయ, సహకార 164

పశు సంవర్థక, మత్స్య, డెయిరీ 171

బీసీ సంక్షేమ 5,134

ఇంధన 441

వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ 6,736

ఉన్నత విద్య 387

హోం 15,395

నీటి పారుదల 722

మైనార్టీ సంక్షేమ 1,395

పురపాలక, పట్టణాభివృద్ధి 222

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి 499

రెవెన్యూ 609

ఎస్సీ అభివృద్ధి 1,769

సెంకడరీ విద్య 10,113

రవాణా, రోడ్లు, భవనాలు 332

ఎస్టీ సంక్షేమ 1,070

మహిళా సంక్షేమ, వికలాంగ, వయోవృద్ధుల 8

ఇప్పటివరకు నియామక పత్రాలు అందించినవి 45,167

నియామక పత్రాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నవి

గ్రూప్-4 అభ్యర్థుల పోస్టులు 8,143

మొత్తం 53,310