06-04-2025 11:09:03 PM
డీజే పాటలు కాషాయపు జెండాలతో ఉత్సాహంగా పాల్గొన్న యువకులు...
రాముని విగ్రహానికి పూజలు చేసిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎస్పీలు..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): శ్రీరామ నవమి సందర్భంగా భారీ శోభాయాత్ర నిర్వహించారు. శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం నుండి ప్రారంభమైన భారీ శోభాయాత్రలో ఎంపీ గోడం నగేష్(MP Godam Nagesh), ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar), ఎస్పీ అఖిల్ మహాజన్(SP Akhil Mahajan) పాల్గొన్నారు. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో శ్రీ రాముని భారీ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు.
ముందుగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణము చేశారు. శోభయాత్రలో యువకులు చేసిన జైశ్రీరామ్ అనే నినాదంతో పట్టణ పురవీధులన్ని మారుమ్రోగాయి. డీజే పాటల కనుగుణంగా యువకులు నృత్యాలు చేస్తూ, కాషాయపు జెండాలను రెపరెపలాడిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అటు యువకులతో కలిసి ఎమ్మెల్యే సైతం నృత్యాలు చేస్తూ యువతలో మరింత ఉత్సాహాన్ని నింపారు. శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ అఖిల్ మహాజన్, డీఎస్పీ జీవన్ రెడ్డి(DSP Jeevan Reddy)లు దగ్గరుండి స్వయంగా శాంతిభద్రతలను పర్యవేక్షించారు. మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనంలో ఎస్పీ ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా శోభాయాత్రను పర్యవేక్షించారు.