calender_icon.png 7 April, 2025 | 7:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘నామినేటెడ్’ ఫైనల్!

06-04-2025 12:00:00 AM

మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త, ఉపలోకాయుక్త పేర్లు ఖరారు

గవర్నర్‌కు చేరిన జాబితా?

సమాచార కమిషనర్ పోస్టులకు భారీగా ఆశావహులు 

ఎంపికకు మరో వారం రోజులు పట్టే అవకాశం

దరఖాస్తులను పరిశీలించిన సీఎం, డిప్యూటీ సీఎం 

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయింది. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యులు, తెలంగాణ లోకాయుక్త, ఉపలోకాయుక్త, తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, కమిషనర్ ఎంపికపై తెలంగాణ ప్రభుత్వం శనివారం సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పాల్గొని దరఖాస్తులను పరిశీలించారు. అయితే మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యులు, లోకాయుక్త, ఉపలోకాయుక్త పదవులకు సంబంధించిన పేర్లు ఖరారైనట్లుగా తెలిసింది.

ఖరారు కావడమేకాకుండా గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఆమోదానికి జాబితాను కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపించినట్లు తెలుస్తోంది. ఈ పదవులకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను వడబోసిన ప్రభుత్వం..తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, కమిషనర్ ఎంపికకు మరో వారం రోజుల వరకు సమయం పట్టనున్నట్లు సమాచారం. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారిలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఈనేపథ్యంలోనే దీని ఎంపిక ప్రక్రియను వాయిదా వేసినట్లు సమాచారం. ఈక్రమంలోనే తొలుత గవర్నర్‌కు మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యులు, లోకాయుక్త, ఉపలోకాయుక్తకు పేర్లు ఖరారు చేసి జాబితాను పంపినట్లు తెలిసింది.