calender_icon.png 29 September, 2024 | 4:49 PM

భారీగా పెరిగిన బంగారం దిగుమతులు

18-09-2024 12:00:00 AM

కస్టమ్స్ సుంకం తగ్గింపు, పండగల సీజన్ ఫలితం

న్యూఢిల్లీ: బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గించడం, పండగల సీజన్ డిమాండ్ కారణంగా మన దేశ బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. ఆగస్టు నెలలో దిగుమతులు రెట్టింపు అయ్యాయి. గత ఏడాది ఆగస్టులో 4.83 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని మన దేశం దిగుమతి చేసుకోగాఈ ఏడాది 10.06 బిలియన్ డాలర్లకు ఈ దిగుమతులు పెరిగాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడం వల్లనే బంగారం దిగుమతులు పెరిగాయని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భత్వాల్ తెలిపారు.

కాగా స్మగ్లింగ్, ఇతర కార్యకలాపాలు తగ్గుముఖం పడుతున్నాయని కూడా ఆయన చెప్పారు. అలాగే పండగల సీజన్ కావడంతో వ్యాపారులు పెద్ద మొత్తంలో ఆభరణాలను సిద్ధం చేస్తుంటారని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.  ఇటీవల బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతంనుంచి ఆరు శాతానికి తగ్గించిన విషయం  తెలిసిందే. బంగారం దిగుమతుల్లో చైనా తర్వాతి స్థానంలో భారత్ నిలుస్తోంది.