* ఓయూ అనుబంధ ఇంజినీరింగ్ కాలేజీల్లో అమలు
* ఇతర వర్సిటీలతో పోల్చుకుంటే ఫీజులు డబుల్
* విద్యార్థులకు ఇబ్బందిగా మారిన యాజమాన్య నిర్ణయం
హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) తన పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సెమిస్టర్ పరీక్షా ఫీజులను భారీగా పెంచింది. ఫీజులు పెంపు కాకతీయ యూనివర్సిటీ (కేయూ), జేఎన్టీయూహెచ్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) పరీక్ష ఫీజుల కంటే, ఓయూలో డబుల్ ఫీజు చెల్లించాల్సి రావడంతో విద్యార్థులకు ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పేలా లేవు.
అయినప్పటికీ యాజమాన్యం ‘వెనక్కి తగ్గేదే లేదు..’ అన్న ధోరణితో ఉండడంతో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. విద్యార్థుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఓయూలో చదువుకునే విద్యార్థుల్లో ఎక్కువమంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే అయి ఉంటారు.
ఇంతేసి ఫీజులు చెల్లించాలంటే కష్టతరమే. ఓయూ యాజమాన్యం ఫీజుల పెంపు నిర్ణయంపై పునరాలోచన చేయాలనే ఆలోచన సర్వత్రా వ్యక్తమవుతున్నది.
జేఎన్టీయూలో ఫీజులు ఇలా..
జేఎన్టీయూ ఒక్కో విద్యార్థి సెమిస్టర్ రెగ్యులర్ ఫీ జు అన్ని పేపర్లకు రూ.955, బ్యాక్‌లాగ్ ఫీజులు ఒక సబ్జెక్ట్‌కు రూ.365, రెండు సబ్జెక్టులకు రూ.615, మూ డు సబ్జెక్టులకు రూ.840, నాలుగు, అంతకంటే ఎక్కు వ సబ్జెక్టులకు రూ.955 ఫీజు చెల్లించాల్సి ఉన్నది.
కేయూలో..
కాకతీయ యూనివర్సిటీ (కేయూ) పరిధిలో సెమిస్టర్ రెగ్యులర్ ఫీజు ఒక్కో విద్యార్థి అన్ని పేపర్లకు రూ.1,200, బ్యాక్‌లాగ్ ఫీజు మూడు పేపర్ల వరకు రూ.1,100, రెండు పేపర్ల వరకు రూ.600 చెల్లించాల్సి ఉన్నది.
ఎంజీయూలో..
మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ)లో ఒక్కో విద్యార్థి సెమిస్టర్ రెగ్యులర్ ఫీజు అన్నిపేపర్లకు రూ.1,300, బ్యాక్‌లాగ్ ఫీజులు మూడు పేపర్ల వరకు రూ.760, అన్నిపేపర్లకు రూ.1,300 చొప్పున చెల్లించాల్సి ఉంది.
ఓయూ పరిధిలో..
అత్యధికంగా ఓయూ పరిధిలో ఒక్కో విద్యార్థి సెమిస్టర్ రెగ్యులర్ ఫీజు అన్ని పేపర్లకు రూ.2,660, సెమిస్టర్ బ్యాక్‌లాగ్ ఫీజులు నాలుగు పేపర్ల వరకు రూ.1,620 చెల్లించాల్సి ఉంది.