22-04-2025 01:20:14 AM
కారును ట్రాక్‌లోకి తేవడమే వరంగల్ సభ వ్యూహం
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): రాజకీయ పార్టీల భారీ బహి రంగ సభలంటే టక్కున గుర్తుకువచ్చేది బీఆర్‌ఎస్ పార్టీయే. భారీ బహిరంగ సభలకు ఒక క్రేజ్ తీసుకువచ్చింది కూడా ఆ పార్టీయే. బీఆర్‌ఎస్‌గా పేరు మార్చుకున్న టీఆర్‌ఎస్ పార్టీ 2001, ఏప్రిల్ 27 ఆవిర్భవించింది. ఆదే ఏడాది మే 17న ‘తెలం గాణ సింహగర్జన’ పేరిట కరీంనగర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభ తెలంగాణ ఉద్యమాన్నే మలుపు తిప్పిందనే చెప్పుకోవాలి.
ఆ సభ ద్వారా టీఆర్‌ఎస్ ఇమే జ్ ఆమాంతంగా పెరిగిపోయింది. ఆ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నందున సభ ప్రభావం అప్పుడు టీఆర్‌ఎస్ ఘన విజయానికి బాటలు వేసింది. పార్టీ పెట్టిన కొన్ని నెలల్లోనే కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో జెడ్పీలను టీఆర్‌ఎస్ గెల్చుకున్నది. పార్టీ అధినేత కేసీఆర్ ఆ తర్వాత ఎన్నో బహిరంగ సభలను అత్యంత భారీగా నిర్వ హించారు.
పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కరీంనగర్ మీటింగ్ తర్వాత తెలంగాణలోని ప్రతి జిల్లాలో భారీ బహిరంగ సభలను కేసీఆర్ నిర్వహించారు. 2003లో హైదరాబాద్‌లో తెలంగాణ గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. 2009 డిసెంబర్ 16న వరం గల్‌లో నిర్వహించిన తెలంగాణ మహాగర్జన సభకు దాదాపు 25 లక్షల మంది జనం హాజరైనట్లు ప్రచారం జరిగింది.
ఈ సభ అత్యధిక మంది ప్రజలు హాజరైన బహిరంగ సభగా రికార్డుల్లోకి ఎక్కిం ది. ఈ పబ్లిక్ మీటింగ్‌పై న్యూయార్క్ టైమ్స్ కూడా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వరంగల్‌లో నిర్వహించిన సభల న్నీ కూడా భారీ సభలుగా చరిత్రలో నిలిచిపోయాయి. భారీ సభలను నిర్వహించ డంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జాతీయ స్థాయిలో మద్దతు కూడ గట్టేందుకు కేసీఆర్ జాతీయ నేతలను ముఖ్య అతిథులుగా ఆ సభలకు పిలిచేవారు.
మాజీ ప్రధాని దేవేగౌడ, జాతీయ నేతలు శరద్ పవార్, రాంవిలాస్ పాశ్వాన్, అజిత్ సింగ్, శిబూ సోరెన్‌లతో పాటు స్వామి అగ్నివేష్ లాంటి సామాజిక ఉద్యమకారులు హాజరై తెలంగాణ అంశానికి గట్టి మద్దతు పలికారు. ఇలా భారీ బహిరంగ సభల ట్రెండ్‌ను టీఆర్‌ఎస్ కొత్తగా రాజకీయాల్లోకి తీసుకు వచ్చిందనే చెప్పుకోవాలి.
తెలంగాణ రాష్ట్రం అంశాన్ని బలంగా జాతీయస్థాయిలో తీసుకువెళ్లేందుకు, రాష్ట్ర డిమాండ్‌కు మద్దతు కూడగట్టేందుకు కేసీఆర్ భారీ సభల నిర్వహణను ఒక ఎత్తుగడగా వాడేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ అనేక భారీ బహిరంగ సభలను నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు పబ్లిక్ మీటింగులను తరచుగా నిర్వహించారు.
ఇక అధికారం కోల్పోయిన కొద్ది నెలల్లోనే కృష్ణా జలాల అంశంపై నల్లగొండలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. అనంతరం ఎంపీ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. ఈనెల 27న పార్టీ ఏర్పడి 25 ఏళ్లు నిండుతున్న సందర్భంగా రజతోత్సవ సభను వరంగల్‌లో అత్యంత భారీగా నిర్వహించాలని కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ సభ ద్వారా పడిపోయిన పార్టీ గ్రాఫ్‌ను పెంచేందుకు కసరత్తులు చేస్తున్నారు.
ఇప్పటికే జిల్లాల వారీగా తమ ఫామ్‌హౌజ్‌లో నేతలతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. జిల్లాల నుంచి భారీగా జనసమీకరణ చేసేందుకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. పార్టీని వీడిన ఎమ్మెల్యేల అంశంలో ఉప ఎన్నికలు వస్తాయని కారు పార్టీ అంచనా వేస్తోంది. ఆ బైఎలక్షన్లే గనుక వస్తే పార్టీని ట్రాక్ ఎక్కించేందుకు వరంగల్ సభ ఉపకరిస్తుందనేది గులాబీ పార్టీ అధినేత వ్యూహం.