calender_icon.png 30 October, 2024 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గూగుల్‌కు భారీ ఫైన్

29-10-2024 12:30:39 AM

ఓ చిన్న సంస్థను తొక్కేసిన ఫలితం!

కాలిఫోర్నియా: సెర్చింజన్ దిగ్గజం గూగుల్ భారీ ఫైన్ చెల్లించాల్సి వస్తోంది. ఓ చిన్న వెబ్‌పైట్‌ను తన స్వార్థం కోసం తొక్కేసినట్లు అది ఆరోపణలు ఎదుర్కొంటోంది. యూకేకు చెందిన షివన్, ఆడమ్ రిఫ్ అనే జంట 2006లో ధరలను పోల్చే వెబ్‌పైట్‌ను ప్రారంభించారు. దీనికి ’ఫౌండెమ్’ అని పేరు పెట్టారు.

వీరు ఆ వెబ్‌సైట్‌ను లైవ్‌లోకి తెచ్చాక.. గూగుల్ సెర్చ్‌లో  నాటకీయంగా దాని విజిబులిటీ పడిపోవడం మొదలైంది. జనం ’ప్రైస్ కంపారిజన్’, ’షాపింగ్’ వంటి కీ వర్డ్స్ వాడినా ఈవెబ్‌పైట్‌నుకనిపించడం లేదు. గూగుల్‌కు చెందిన ఆటోమేటెడ్ స్పామ్ ఫిల్టర్స్ విధించిన పెనాల్టీ కారణంగా తమ వెబ్‌పైట్ పడిపోతోందని షివన్, ఆడమ్ రిఫ్ గుర్తించారు.

దీనికితోడు గూగుల్‌లో దాని ర్యాంక్ కూడా గణనీయంగా పడిపోయింది. ఇతర సెర్చి ఇంజిన్లలో సాధారణంగానే ఉన్నట్లు గమనించారు. ఫలితంగా ’ఫౌండెమ్’ ఆదాయం కూడా పడిపోయింది. సాంకేతిక కారణాల వల్లే తమ పేజీ సెర్చిలో కనిపించలేదని గుర్తించి.. గూగుల్‌తో ఈవిషయాన్ని ప్రస్తావించారు.

దాదాపు రెండేళ్లైనా అది పెనాల్టీని తొలగించలేదు. దీంతో ఆ జంట చేసేది లేక ఐరోపా కమిషన్‌ను ఆశ్రయించింది. అధికారులు సుదీర్ఘకాలంపాటు దర్యాప్తు చేసి.. గూగుల్ తన షాపింగ్ సర్వీస్‌ను ప్రమోట్ చేసుకోవడానికి.. ’ఫౌండెమ్’ వంటి సంస్థలతో అన్యాయంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు.

మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందని 2017లో తీర్పును వెలువరించింది. 2.4 బిలియన్ పౌండ్ల (సుమారు రూ.26 వేల కోట్లు) ఫైన్ వేసింది. దీనిపై ఆ సెర్చింజన్ అప్పీల్‌కు వెళ్లింది. దాదాపు ఏడేళ్లపాటు న్యాయపోరాటం జరిగింది. చివరికి ’ది యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్’ కింది న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు ను సమర్థించింది.

గూగుల్ అప్పీల్ను తిరస్కరించింది. దీనిపై షివన్, ఆడమ్ రిఫ్ జంట స్పందిస్తూ తీర్పు చాలా ఆలస్యమైందని అభిప్రాయపడింది. వీరి ఫౌండెమ్‌ను 2016లో మూసివేయాల్సి వచ్చినా.. సివిల్ డామేజ్ క్లెయిమ్లపై కేసు 2026లో విచారణకు రానున్నట్లు తెలిపారు.‚