calender_icon.png 14 November, 2024 | 11:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్‌లో భారీ పేలుడు!

11-11-2024 12:01:26 AM

  1. తెలంగాణ స్పైసీ కిచెన్‌లో గ్యాస్ లీకేజీతో బ్లాస్ట్?
  2. భారీ శబ్దాలతో ధ్వంసమైన హోటల్ ప్రహరీ
  3. సమీపంలోని బస్తీలోకి దూసుకొచ్చిన బండరాళ్లు
  4. నాలుగు గుడిసెలు ధ్వంసం.. ఒక మహిళకు గాయాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 10 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1లో ఉన్న తెలంగాణ స్పైస్ కిచెన్ హోటల్‌లో ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటలకు భారీ పేలుడు సంభవించింది. దీంతో హోటల్ ప్రహరీ ధ్వంసమైంది. రాళ్లు ఎగిరి సమీపంలోని దుర్గాభవానీ నగర్ బస్తీలో పడ్డాయి.

నాలుగు గుడిసెలు ధ్వంసం కాగా, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఘటనలో ఓ మహిళకు గాయాల య్యాయి. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకు న్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పేలుడుతో రెస్టారెంట్‌లోని  వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి.

డీసీపీ విజయ్‌కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి హోటల్ నిర్వాహకులతో మాట్లాడారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. హోటల్ మేనేజర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తు న్నారు. గ్యాస్ లీకేజీ వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు.

పేలుడు ఘటనపై క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నాయని, పేలుడు ఎలా సంభవించిందనే అంశమై అగ్నిమాపక సిబ్బంది, బాంబ్‌స్కాడ్ తనిఖీలు చేపట్టాయని పేర్కొన్నారు. మరోవైపు హోటల్ నిర్వాహకులు మీడియాను లోపలికి అనుమతించకపోవడంతో పేలుడుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సమాచారం అందుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. 

గ్యాస్ లీకేజీ వల్ల ప్రమాదం

గ్యాస్ లీకేజీ వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చామని వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. ఫైర్, క్లూస్ టీం బృందాలతో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. హైడ్రా బృందం కూడా ఘటనపై దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు. ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. హోటల్‌కు సంబంధించిన ఫైర్ సెఫ్టీ అంశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.