- ఒకరి మృతి, పలువురికి గాయాలు
- యాదగిరిగుట్ట పెద్దకందుకూరులో ఘటన
- క్షతగాత్రులను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
నల్లగొండ (యాదాద్రి భువనగిరి), జనవరి 4 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్(బాంబుల తయారీ) పరిశ్రమలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు చనిపోగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి.
కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిశ్రమలో ఉదయం పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. ప్రమాదాన్ని పసిగట్టిన సిబ్బంది వెంటనే అత్యవసర సైరన్ మోగించి కార్మికులను అప్రమత్తం చేశారు. దీంతో కార్మికులు ఒక్కసారిగా పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు. క్షణాల్లో పరిశ్రమ ఆవరణలో పెద్దఎత్తున పొగ అలుముకుంది.
అయితే పరిశ్రమలో పేలుడు జరిగిన ఏరియాకు దగ్గర్లో ఉన్న కార్మికుల్లో ఒకరు చనిపోగా పలువురుకి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వారికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తిని జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన కనకయ్యగా గుర్తించారు. గాయపడినవారిలో యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన మొగిలిపాక ప్రకాశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
పరిశ్రమలో గతంలో ఇదే తరహా ఘటనలు సంభవించి పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. కొంతమంది శాశ్వత వైకల్యానికి గురైనట్లు కార్మికులు తెలిపారు. బాంబులు తయారు చేసే పరిశ్రమ కావడంతో ముడి పదార్థాలు పేలాయా? లేక బాంబులే పేలాయా? అన్న దానిపై స్పష్టత రాలేదు.
యాజమాన్యంపై మండిపడిన ప్రభుత్వ విప్
పరిశ్రమలో పేలుడు జరిగిన ప్రాంతాన్ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. తరుచూ ప్రమాదాలు జరుగుతున్నా నివారణ చర్యలు తీసుకోవడంలో యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆయన మండిపడ్డారు. వెయ్యి మంది సిబ్బంది పనిచేస్తున్న పరిశ్రమలో అంబులెన్స్ కూడా లేకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఘటనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.
మృతిచెందిన కార్మికుడి కుటుంబానికి పరిహారం అందించేందుకు యాజమాన్యం ముందుకు వచ్చినట్లు తెలిసింది. మాజీ ప్రభుత్వవిప్ గొంగిడి సునీతతోపాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలు పరిశ్రమను పరిశీలించి క్షతగాత్రులను పరామర్శించారు. క్షతగాత్రులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.