ఐదుగురు నక్సల్స్ మృతి
5 ఏకేే సహా పేలుడు పదార్థాల స్వాధీనం
ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలు
కొనసాగుతున్న కాల్పులు
రాయ్‌పూర్, నవంబర్ 16: ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మఢ్ అడవుల్లో శనివారం ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా సరిహద్దుల్లోని బస్తర్ డివిజన్‌లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. సంఘటనా స్థలం నుంచి 5 ఆటోమేటిక్ ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడగా వారిని హెలికాప్టర్ ఆంబులెన్స్‌లో రాయ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
ఎన్‌కౌంటర్ జరుగుతున్న ప్రాంతం దండకారణ్యంలో కోర్ ఏరియాలో ఉండటంతో సైనికులతో సంప్రదించలేకపోతున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాథమికంగా మావోయిస్టులకు భారీ నష్టమే జరిగిందని, చాలా మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు.
ఉదయం నుంచే కాల్పులు
అబుజ్‌మఢ్ అటవీప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో కూంబింగ్ మొదలు పెట్టినట్లు బస్తర్ రేంజ్ ఐజీ పీ సుందర్‌రాజ్ పేర్కొన్నారు. జిల్లా రిజర్వ్ గార్డ్స్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఉదయం 8 గంటలకు ఎదురుకాల్పులు జరిగాయని చెప్పారు. సంఘటన స్థలంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
సంఘటనా స్థలం నుంచి ఐదుగురు నక్సల్స్ మృతదేహాలతో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మృతిచెందినవారి గుర్తింపుపై స్పష్టత ఇవ్వలేదు. అక్టోబర్ 4న అబుజ్‌మఢ్ అడవుల్లోనే అతిపెద్ద ఎన్‌కౌంటర్ జరగగా 31 మంది మావోయిస్టులు మరణించారు.