calender_icon.png 26 October, 2024 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత

26-10-2024 01:53:33 AM

  1. 21 లక్షల విలువైన 130 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం
  2. సుడాన్ దేశస్థుడు సహా నలుగురు అరెస్ట్
  3. వివరాలు వెల్లడించిన సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 25 (విజయక్రాంతి): నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రెండు వేర్వేరు ఘటనల్లో సుమా రు రూ. 21 లక్షల విలువచేసే డ్రగ్స్‌ను పట్టుకున్నారు పోలీసులు. ఓ విదేశీయుడు సహా మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు.

ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సుడాన్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ ఉస్మాన్ హైస్కూల్ పూర్తి చేసిన తర్వాత 2016లో స్టూడెంట్ వీసాపై మొదటిసారి హైదరాబాద్ వచ్చాడు.

టోలిచౌకి ప్రాంతంలో నివాసముంటూ మోహదీపట్నంలోని ఆప్టిక్ ఇన్‌స్టిట్యూట్‌లో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు చదివాడు. అనంతరం 2017లో తిరిగి తన దేశానికి వెళ్లిపోయాడు. మళ్లీ 2018లో నాలుగేళ్లు చెల్లుబాటయ్యే స్టూడెంట్ వీసాపై హైదరాబాద్‌కు వచ్చాడు. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని గ్లోకల్ యూనివర్సిటీలో బీసీఏ కోర్సు లో జాయిన్ అయ్యాడు.

మొదటి సంవత్సరం పూర్తయ్యాక కోవిడ్ వ్యాప్తి చెందడంతో తిరిగి సుడాన్ వెళ్లిపోయాడు. రెండేళ్ల తర్వాత తిరిగి యూపీకి వెళ్లి బీసీఏ కోర్సు పూర్తి చేశాడు. ఆ తర్వాత జూలై 2024లో హైదరాబాద్ వచ్చి విలాసవంతమైన జీవితం అనుభవించడానికి డ్రగ్స్ దందాలోకి దిగాడు.

ఈ క్రమంలో నైజీరియన్లు, టాంజానియన్లు, సుడాన్, పాలస్తీనా దేశస్థులతో పాటు స్థానిక సరఫరాదారుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి అధిక ధరలకు కస్టమర్లకు విక్రయించే వాడు. సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్ ఆర్డర్లు స్వీకరించడంతో పాటు డబ్బు చెల్లింపులకు మ్యూల్ ఖాతాలు ఉపయోగిస్తున్నట్లు గుర్తించినట్లు సీపీ తెలిపారు.

పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం హెచ్‌న్యూ టీం హుమాయున్‌నగర్ పోలీసులతో కలిసి అబ్దుల్ రెహ మాన్ ఉస్మాన్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడి నుం చి రూ. 8 లక్షల విలువైన 50 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.   

మరో ఘటనలో..  

బంజారాహిల్స్‌కు చెందిన మహమ్మద్ ఇమ్రా న్ అలియాస్ షుకూర్ అలియాస్ సాహిల్ అలియాస్ ఇమ్ము పాఠశాల విద్యను మధ్యలోనే ఆపే సి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. విలాసవంతమైన జీవితం కోసం డ్రగ్స్ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరిలో హాష్ ఆయిల్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి ఇటీవల తిరిగొచ్చాడు.

ఇమ్రాన్ బెంగళూరు వెళ్లి ఓ నైజీరియన్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తుంటాడు. అలాగే డెడ్ డ్రాప్ ద్వారా కేరళకు చెందిన నందకుమార్ అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ సేకరిస్తాడు. వీటిని కొడిదల నవీన్ అనే వ్యక్తి సాయంతో హైదరాబాద్‌లోని కస్టమర్లకు విక్రయిస్తున్నాడు.

విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం సాయంత్రం హెచ్‌న్యూ టీం కంచన్‌బాగ్ పోలీసులతో దాడులు జరిపి ఇమ్రాన్, నవీన్, నందకుమార్‌ను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 13 లక్షల విలువైన 80 గ్రాముల ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ బాల్స్ 10, వెయింగ్ మెషిన్, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను  రిమాండ్‌కు తరలించామని సీపీ ఆనంద్ తెలిపారు.