27-02-2025 01:38:34 AM
శివ నామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు
భక్తులతో పోటెత్తిన ఆలయాలు
సూర్యాపేట, ఫిబ్రవరి26(విజయక్రాంతి): హరహర మహాదేవ..’ ‘శంభోశంకర..’ అంటూ సాగిన శివనామస్మరణతో జిల్లాలోని శైవక్షేత్రాలు మార్మోగాయి. గురువారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా పిల్లలమర్రి, మేళ్లచెర్వులోని శివలయాలలో వేలాది మంది భక్తులతో పోటెత్తాయి. ఎటు చూసినా జనసందోహమే కనిపించింది.మేళ్ల చెర్వు శివాలయంలో రాష్ట్ర ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతీ, పిల్లలమర్రి దేవాలయంలో రాష్ట్ర పర్యాటక సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి , నాగారంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హుజూర్ నగర్ నియోజకవర్గంలో...
మహా శివరాత్రి సందర్భంగా మేళ్లచెరువు శివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఎద్దుల పందెలను ప్రారంభించారు. అదే విదంగా బూరుగడ్డలోనిశ్రీ నల్లకట్ట సంతానకామేశ్వరి శంబు లింగేశ్వరా స్వామి శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన పట్టువస్త్రా లు సమర్పించిన జాతీయ ఐ యన్ టి యు సి కార్యదర్శి యారగాని నాగన్న గౌడ్, అరుణ్ కుమార్ దేశముఖ్, చిమట సైదులు, బ్రహ్మ శ్రీ గుంటిపళ్ళీ రవీంద్రాచారి లు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.కీత వారిగూడెం లో శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా, హుజూర్ నగర్ పట్టణంలోని శ్రీ పార్వతీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు.
కోదాడ నియోజకవర్గంలో..
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కోదాడ నియోజక వర్గంలో పలు చోట్ల శివాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోదాడతో పాటు గొండ్రియాలలో, చన్నుపల్లి , వల్లపురం, జక్కేపల్లిలోని శివాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. జక్కేపల్లి లో కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డిస్వామివారిని దర్శించుకొని,ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భం గా మాట్లాడుతు నియోజక వర్గంలోని ప్రజలందరూ శివపార్వతుల ఆశీస్సులతో సుభిక్షం గా ఉండాలన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు,భక్తులు పాల్గొన్నారు
తుంగతుర్తి నియోజకవర్గంలో...
మహాశివరాత్రి వేడుకల సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం, నాగారం, మద్దిరాల, నూతనకల్, తిరుమలగిరి మండలాల్లోని ఆలయాల్లో వేకువజాము నుండే భక్తులు ఆలయాలకు బారులు తీరి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు.నాగారం మండల కేంద్రంలోని శివాలయంలో మాజీమంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి సునీత దంపతులు కుటుంబ సమేతంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపి,స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.అనంతరం ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని అర్వపల్లి చిన్నగుట్ట, తిమ్మాపురంలోని సూర్యదేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ నిర్వాహకులు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
చెరువుగట్టు, వాడపల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు
నల్లగొండ, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి) : నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. శివాలయాలు భక్తుల శివనామస్మరణతో మారుమోగాయి. ఉదయం నుంచే ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది. నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు జడల రామలింగేశ్వరస్వామి ఆలయం, దామరచర్ల మండలం వాడపల్లి మీనాక్షీఅగస్తేశ్వరస్వామి ఆలయం, అనుముల మండలం పేరూరు శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు కొనసాగాయి.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చెరువుగట్టు రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. వాడపల్లిలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అగస్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఏలేశ్వర కొండపై మల్లయ్య స్వామిని దర్శించుకునేందుకు నాగార్జున సాగర్ నుంచి పర్యాటకశాఖ ఉదయం నుంచే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక లాంచీలు నడిపింది. ఏడాదికి ఒక్కసారే మల్లయ్యస్వామి దర్శనానికి అవకాశం ఉండడంతో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి పూజలు నిర్వహించి మొక్కు చెల్లించుకున్నారు.
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి)..
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఫిబ్రవరి 26: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం మండలంలోని అన్ని గ్రామాల్లో మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.మండల పరిధిలోని కొమ్మాల గ్రామంలోని శ్రీ పార్వతీ సోమేశ్వర స్వామి ఆలయంలో మామిడి తోరణాలతో మరియు జల బిందెలతో మహిళలు పెద్ద ఎత్తున స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండల పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి, భక్తులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
శివ నామ స్తోత్రాలతో మారు మ్రోగిన శైవ క్షేత్రాలు
యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 26 ( విజయ క్రాంతి ): మహాశివరాత్రి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామ స్తోత్రాలతో మారు మ్రోగాయి. శంభో హర హర మహాదేవ, కైలాసనాథ, అర్ధనారీశ్వర అంటూ భక్తులు వివిధ పేర్లతో దేవ దేవుని కొలుస్తూ పూజలు నిర్వహించారు. శివాలయాలకు నిలయమైన ఆలేరు మండలం కొలనుపాక లోని పురాతన ఆలయాలకు భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్షను విరమించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపైగల శివాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.
గత ఐదు రోజులుగా శివరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. చౌటుప్పల్, మోత్కూరు, రామన్నపేట, భూదాన్ పోచంపల్లి, బీబీనగర్, ఆలేరు, మండలాల్లోని శివాలయాలలో భక్తులు పూజలు నిర్వహించారు. ఆలయాల నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భువనగిరి పట్టణంలోని పచ్చల కట్ట సోమేశ్వరాలయంలో జరిగిన కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేశారు .
ఎమ్మెల్యే కు ఆలయ కమిటీ అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. పట్టణంలోని ధోబివాడ, రెడ్డి వాడ, గంజ్, హనుమాన్ వాడ, మాస్కుంట ప్రాంతాలలో నీ శివాలయాలలో దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు ఉదయం నుండి పచ్చి మంచినీళ్లు కూడా త్రాగకుండా శివునిపై మనసు లగ్నం చేసి అత్యంత దీక్షా దక్షతలతో ఉండి సాయంత్రం గంగ స్నానం ఆచరించి శివాలయాలకు వెళ్లి దర్శనం చేసుకున్నారు. అనంతరం తీర్థం తీసుకొని ఉపవాసాన్ని విడిచి పళ్ళు, పాలు తీసుకున్నారు. ఆలయాలలో దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున బార్లుగా నిల్చున్నారు.