03-03-2025 12:00:00 AM
చేర్యాల, మార్చి 2: ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాలు దగ్గర పడడం, రైతులకు వ్యవసాయ పనులు పూర్తయి, ఖాళీ సమయం దొరకడం, త్వరలో పిల్లలకు పరీక్షలు ప్రారంభం కానుండడం తదితర కారణాల రీత్యా మల్లన్న దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా జగిత్యాల, కోరుట్ల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, అదిలాబాద్ తదితర జిల్లాల నుంచి పదుల సంఖ్యలో టూరిస్ట్ బస్సుల నిండా తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పట్టింది. రద్దీకి తగ్గట్లు ఆలయ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు ఆదివారం వేకువ జామునే లేచి స్వామివారి పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరించారు.
అనంతరం తెల్లవారుజాము నాలుగు గంటల నుండే స్వామివారి దర్శనార్థం నిలుచున్నారు. భక్తులు భారీగా బారులు తీరారు. స్వామివారి ఆలయ ద్వారం తెరవగానే గర్భగుడిలో ఉన్న మల్లన్న స్వామిని దర్శనం చేసుకున్నారు. కొంతమంది భక్తులు గజ్జెల లాగులతో, చేతిన డమరుకాలతో, డోలు చప్పులతో ఊరేగింపుగా వచ్చి గంగారేణి చెట్టు వద్ద స్వామివారికి మొక్కులు చెల్లించుకొని , నివేదించుకున్నారు. పట్నాలు వేసి భక్తితో వేడుకున్నారు. అదేవిధంగా గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనం నైవేద్యంగా సమర్పించి, మమ్ము కరుణించమని భక్తితో మొక్కుకున్నారు. ఆలయ ఈవో రామాంజనేయులు తన సిబ్బందితో ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం పూట వాహనాల రాకపోకలు భారీగా ఉండడంతో ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.