calender_icon.png 17 November, 2024 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాలో హిందువుల భారీ ప్రదర్శన

11-08-2024 05:42:04 AM

  1. తామూ బెంగాలీలమేనంటూ నినాదాలు 
  2. మైనారిటీలపై దాడులపై తీవ్ర ఆగ్రహం 
  3. న్యాయం చేయాలని డిమాండ్

ఢాకా, ఆగస్టు 10: బంగ్లాదేశ్‌లో వారం రోజులుగా తీవ్ర దాడులు, అణచివేత ఎదుర్కొంటున్న మైనారిటీ హిందువులు తమ ప్రాణాలు, ఆస్తులను కాపాడుకొనేందుకు గళమెత్తారు. దేశ రాజధాని ఢాకాలో వేలమంది హింవులు రోడ్లపైకి వచ్చిన మెజారిటీ వర్గమైన ముస్లింలు తమపై దాడులు చేయటాన్ని ఖండించారు. భారీ ర్యాలీ నిర్వహించి దమనకాండపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మనం ఎవరిమి? బెంగాలీలం.. బెంగాలీలం’ అని నినదించారు. 

దారుణ మారణకాండ

రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంగా మొదలైన విద్యార్థుల నిరసనలు దేశాన్ని సంక్షోభంలోకి నెట్టడం, షేక్ హసీనా ప్రధాని పదవిని వదిలి పారిపోయి వచ్చి భారత్‌లో ఆశ్రయం పొందటంలో బంగ్లాదేశ్‌లో మత ఛాందసవాదులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ముసుగులో మైనారిటీ హిందువులే లక్ష్యంగా దారుణ మారకాండ సాగిస్తున్నారు. హిందువు కనిపిస్తే చాలు కొట్టి చంపటమో.. లేదంటే తీవ్రంగా వేధించి వదిలేయటమో చేస్తున్నారు. కనీస విచక్షణ లేకుండా సాగుతున్న ఈ హింసలో ఇప్పటికే వందలమంది మైనారిటీలు మరణించారు. వేలకొద్ది హిందులు ఆస్తులు అగ్నికి ఆహుతయ్యాయి.

ఇండ్లు తగులబెట్టడంతో ఎంతోమంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకొంటున్నారు. హసీనా దేశం విడిచి పారిపోయి వారం గడిచిపోయినా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హిందూ మహిళలను వందలమంది మెజారిటీ ప్రజలు తీవ్రంగా వేధించటం, హిందూ పవిత్ర గ్రంధాలను చించి తగులబెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

బంగ్లాదేశ్ జనాభాలో దాదాపు 8 శాతం హిందువులు ఉన్నారు. వీరిలో అత్యధికులు మొన్నటి వరకు అధికారంలో ఉన్న అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులే. అందుకే ప్రతిపక్ష బీఎన్‌పీ, మత ఛాందసవాద జమాతే ఇ ఇస్లామీ సంస్థలు ఒక్కటై మైనారిటీలపై దాడులకు తెగబడుతున్నాయి.  దేశంలోని మొత్తం 64 జిల్లాలకుగాను 52 జిల్లాల్లో మైనారిటీలపై తీవ్రమైన దాడులు జరిగాయని బంగ్లాదేశ్ హిందు బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ ప్రకటించింది. 

ధైర్యం చేసి బయటకొచ్చిన హిందువులు

పది రోజులుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భిక్కుభిక్కుమంటూ గడుపుతున్న హిందువులు ఎట్టకేలకు ధైర్యం చేసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ రోడ్లపైకి వచ్చారు. ‘సేవ్ బంగ్లాదేశ్, సేవ్ హిందూస్’ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకొని భారీ ర్యాలీ నిర్వహించారు. హిందూ ఆలయాలపై దాడులు చేసి తగులబెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. హిందూ రాజకీయ నాయకులను కూడా వెదికి మరీ చంపుతుండటంపై ఆగ్రహావేశాలు వెల్లగక్కారు.