ఒకేవారంలో 17.76 బిలియన్ డాలర్ల క్షీణత
ముంబై, నవంబర్ 22: విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున నిధుల్ని వెనక్కు తీసుకెళులున్న నేపథ్యంలో దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం నవంబర్ 15తో ముగిసిన వారంలో ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రిజర్వులు భారీగా 17.76 బిలియన్ డాలర్లు తగ్గి 657.892 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఒకే వారంలో ఇంతగా తగ్గడం గత కొద్ది ఏండ్లలో ఇదే ప్రధమం.
రికార్డు గరిష్ఠస్థాయి నుంచి ఫారెక్స్ రిజర్వులు తగ్గడం వరుసగా ఇది ఏడోవారం. సెప్టెంబర్ చివరినాటికి ఫారెక్స్ నిల్వలు 704.885 బిలియన్ డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఆ స్థాయి నుంచి వరుస 7 వారాల్లో దాదాపు 48 బిలియన్ డాలర్లు క్షీణించాయి. తాజాగా నవంబర్ 15తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 15.548 బిలియన్ డాలర్లు తగ్గి 569.835 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.
బంగారం నిల్వలూ తగ్గాయ్
ఆర్బీఐ వద్దనున్న బంగారం నిల్వలు కూడా సమీక్షావారంలో 2.068 బిలియన్ డాలర్లు తగ్గి 65.746 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 94 మిలియన్ డాలర్లు తగ్గి18.064 బిలియన్ డాలర్ల వద్ద నిలిచినట్లు రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది.