12-04-2025 01:05:17 AM
హనుమాన్ జయంతికి ముస్తాబైన ఆలయం..
కట్టుదిట్టమైన ఏర్పాట్లు, సర్వం సిద్ధం
2 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా
జగిత్యాల, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం కొండగట్టుకు చేరే రోడ్లన్నీ హనుమాన్ దీక్ష స్వాములతో కాషాయమయమై, ’జైశ్రీరామ్’ నామంతో మార్మోగుతున్నాయి. శుక్రవారం ఉదయం నుండి వేలాది మంది హనుమాన్ దీక్షా స్వాములు, భక్తులు పాదయాత్రతో కొండగట్టు చేరుకుని మొక్కలు సమర్పించుకుంటు న్నారు. జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో నేడు హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా జగిత్యాలతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో హనుమాన్ దీక్షా స్వాములు, భక్తులు తరలిరానున్నారు. శనివారం, హనుమాన్ జయంతి ఒకే రోజున రావడంతో ఈ ఏడాది హనుమాన్ జయంతి మరింత ప్రత్యేకతను ఆపాదించుకుంది.
అసలే ఎండలు ముదిరి వేడి ఎక్కువ ఉన్న నేపథ్యంలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వచ్చే దీక్షా స్వాములు, భక్తులకు ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయం చుట్టూ ఉన్న ఆవరణలో భక్తులు ఎండ వేడిని తట్టుకునేందుకు అనుకూలంగా చలువ పందిళ్లు వేశారు. ఈ ఉత్సవాల నేపథ్యంలో 11వ తేది శుక్రవారం నుండి 13 ఆదివారం వరకు సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తారని, దాదాపుగా 45 వేల మంది హనుమాన్ స్వాములు తమ దీక్షా మాల విరమణ చేస్తారని అధికారులు, ఆలయ సిబ్బంది అంచనా.
ఆలయ ఆవరణలో ఉన్న కోనేరును శుద్ధి చేసి దానికి కొత్త సొబగులు దిద్దారు. కాగా ఈ 3 రోజుల ఉత్సవాల కోసం 14 ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేసి, సుమారు 5 లక్షల లడ్డు ప్రసాదాలను అందుబాటులో ఉంచారు. అలాగే ఆలయ ఆవరణలో గతంలో 64 సిసి కెమెరాలుండగా, శాంతి భద్రతల దృష్ట్యా అదనంగా మరో 50 సిసి కెమెరాలను ఆలయ పరిసరాలలో ఏర్పాటు చేశారు. అలాగే 6 చోట్ల అత్యవసర మందులతో పాటూ వైద్య సిబ్బందిని అందుబాటు లో ఉంచి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. జగిత్యాల కలెక్టర్ బి.సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
శాశ్వత వసతులు కల్పిస్తే బాగుంటుంది
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా నిరంతరం వేలాదిమంది భక్తుల రాకపోకలతో విరాజిల్లుతున్న ఈ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పరిసరాలలో శాశ్వత వసతులు కల్పిస్తే బాగుం టుందని భక్తులు, స్థానిక ప్రముఖులు కోరుతున్నారు. ఏటా జరిగే ఉత్సవాల సమయంలో చాలీచాలని నిధులు కేటాయించి వాటితో చలవ పందిళ్లు, శానిటేషన్ ఏర్పాట్లు చేసి ప్రభుత్వ యంత్రాంగం చేతులు దులుపుకుంటుందనే వాదనలున్నాయి. గుట్టపైగల ప్రధా న ఆలయ ఆవరణలోని ఖాళీ స్థలం చదును చేసి, భక్తులు ఉండడం కోసం అవసరమైన డార్మెంటరీ హాళ్లు, టాయిలెట్ కాంప్లెక్సులు నిర్మిస్తే బాగుంటుంది.