భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో ఈనెల 12న నిర్వహించనున్న ప్రారంభోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జి వి పాటిల్ గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంటకు 31 టన్నులతో 2.5 మెగావాట్ల సామర్థ్యంతో అశ్వరావుపేట పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో నిర్మించినటువంటి పవర్ ప్లాంట్ ను పండగ రోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆయిల్ఫడ్ టీం, జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు. రైతులందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ పవర్ ప్లాంట్ ప్రారంభించడం ద్వారా ఆయిల్ ఫ్యాక్టరీని మరింత విస్తరించే అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో జిల్లాలో ఇంకా పెద్ద ఎత్తున పామాయిల్ సాగుతో ముందుకు సాగడానికి ఈ పవర్ ప్లాంట్ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.