20-03-2025 02:31:55 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 19(విజయక్రాంతి): అసెంబ్లీలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌లో భాగ్యనగరానికి భారీగా నిధులు దక్కాయి. గ్రేటర్ అభివృద్ధికి ప్రభుత్వం దాదాపు 10వేల కోట్లకు పైగా నిధులు కేటాయించింది. జీహెచ్‌ఎంసీ, జలమండలి, మెట్రో తదితర సంస్థలకు మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్(ఎంఏయూడీ) శాఖ ద్వారా భారీగా నిధులు సమకూరనున్నాయి.
జీహెచ్‌ఎంసీకి 3,101 కోట్లు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)కు బడ్జెట్‌లో రూ. 3,101.21 కోట్లు కేటాయించింది. ఇందులో హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(హెచ్‌సిటీ) ప్రాజెక్టు కోసమే ఏకంగా రూ.2,654 కోట్లు కేటాయించింది. హెచ్‌సిటీలో భాగంగా నగరం లో 31ఫ్లుఓవర్లు, 17అండర్‌పాస్‌లను నిర్మించాలని భావిస్తోంది. దీంతో నగరంలో ట్రాఫిక్ కష్టాలు తప్పే అవకాశముంది.
మిలియన్ ప్లస్ సిటీలకు సంబంధించి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ రూ. 419కోట్లు, ప్రొఫెషనల్‌ట్యాక్స్ కింద రూ.10 కోట్లు, భూసేకరణకు రూ.18.11 కోట్లు, మోటార్ వెహికిల్ కంపెన్సేషన్ కింద రూ.10 లక్షలు కేటాయించింది. ఈసారి బడ్జెట్‌లో రూ. 7,208 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి జీహెచ్‌ఎంసీ ప్రతిపాదనలు పంపింది.
జలమండలికి 3,385 కోట్లు
గ్రేటర్ సహా, ఓఆర్‌ఆర్ వరకు తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ బాధ్యతలు చూస్తున్న హైదరాబాద్ జలమండలికి ఈ సారి బడ్జెట్‌లో రూ.3,385 కోట్లు కేటాయించింది. నగరవాసులకు సరఫరా చేస్తున్న 20వేల ఉచిత తాగునీటి పథకం కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 300కోట్లు కేటాయించింది. సుంకిశాల ప్రాజెక్టుకు వెయ్యికో ట్లు, గోదావరి జలాల తరలింపునకు రూ. 1450 కోట్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.635 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
మెట్రో ఫేజ్‌ణే పనులకు 1100 కోట్లు
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పనులకు సం బంధించి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 1100 కోట్లు కేటాయించింది. పాతబస్తీ మెట్రోకు రూ.500కోట్లు, హెచ్‌ఎంఆర్‌ఎల్ సంస్థ నిర్వహణకు రూ.500 కోట్లు, నాగోల్-ఎయిర్ పోర్టు కారిడార్‌కు వంద కోట్లు కేటాయించింది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టే ఫేజ్-2 పనులకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులు భరించనుండగా.. మిగతా నిధులను కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ రుణ సంస్థల నుంచి సమీకరించాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన డీపీఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. గతేడాది బడ్జెట్‌లో ఇవే నిధులు కేటాయించిన ప్రభుత్వం దాదాపు 300 కోట్లు విడుదల చేసింది.
మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి 1500 కోట్లు
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో రూ.1500 కోట్లను కేటాయించింది. గతేడాది కూడా 1500 కోట్లు కేటాయించగా వాటిలో రూ.50 కోట్లు మాత్రమే విడుదల చేయడం గమనార్హం. హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువులు, కుంటల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ ఏడాది రూ.218 కోట్లను కేటాయించింది. హెచ్‌ఎండీఏకు రూ.700కోట్లు కేటాయించింది. సిటీ సబర్బన్ రైలు ప్రాజెక్టు కోసం రూ.50 కోట్లు కేటాయించారు.