- కల్యాణ వేదిక లేక మిథులా మైదానంలో రామనవమి
- రక్షణ గోడ లేక రామయ్య ఆలయంలోకి వరద నీరు
- భద్రాచల ఆలయ విస్తరణను పట్టించుకోని ప్రభుత్వాలు
- రూ.100 కోట్లతో గత ప్రభుత్వ మాస్టర్ ప్లాన్
- రూపాయీ విదల్చక పోవడంతో ఎక్కడి గొంగళి అక్కడే
- భక్తుల విరాళాలతో ప్రస్తుతం దేవాలయ నిర్వహణ
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 1౨ (విజయక్రాంతి): భద్రాద్రి రామయ్య భక్తులు వసతుల లేమీతో సతమతమవుతున్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో నిరాదరణకు గురైన దక్షిణాది అయోధ్య భద్రాచలం.. స్వరాష్ట్రంలోనూ అంతే వివక్షను ఎదుర్కొన్నది. ప్రధానంగా ఆలయ విస్తరణ, మాడవీధుల ఏర్పాటు, సీతారాముల కల్యాణ మండపం, భక్తుల స్నానాలకు పుష్కరఘాట్, ఆలయ రక్షణకు కరకట్ట నిర్మాణం సమస్య తీవ్రంగా వేధిస్తున్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వంద కోట్ల రూపాయల నిధులు కేటాయించి, సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతామని చెప్పినా.. ఆ దిశగా అడుగే పడలేదు. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా భద్రాచలంలో భక్తులకు వసతులు కల్పిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.
వెయ్యి కాళ్ల మండపంలో కల్యాణం!
భద్రాచలం ఆలయ విస్తరణకు గత ప్రభుత్వ హయాంలో చినజీయర్ స్వామి, ఆర్కిటెక్ ఆనందసాయి మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. దీని ప్రకారం కంచెర్ల గోపన్న కట్టడాలకు ఎలాంటి భంగం కల్గకుండా చుట్టూ ప్రాకారాలు కట్టాలి. మొదటి ప్రాకారాన్ని 20 అడుగులు, రెండో ప్రాకారాన్ని50 అడుగుల ఎత్తులో నిర్మించాలని ప్లాన్‌లో పేర్కొన్నారు. ఎటు నుంచి చూసినా ఆలయం చూడముచ్చటగా కన్పించేలా శిల్ప కళాశోభితంగా నిర్మాణాలు ఉండాలి.
వెయ్యి కాళ్ల మండపాన్ని నిర్మించి, అందులోనే రామయ్య కల్యాణం చేయాలని నిర్ణయించా రు. 40 అడుగులు విస్తరించిన మాడవీధులు, గోదావరి వద్ద పుష్కరణీ, పర్ణశాలను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. 105 అడుగుల ఎత్తయిన శ్రీరామస్తూపాన్ని నిర్మించాలని డిజైన్లు చేశారు. వీటిన్నింటికి 65 ఎకరాల భూమి అవసరం ఉంటుందని అంచానా వేశారు. దేవస్థానానికి ఆంధ్రాలోని పురుషోత్తపట్నంలో ఉన్న భూముల్లో గోశాల, నక్షత్రవనం, పూల, తులసీ తోటల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు.
ప్రసాద్ నిధుల సేకరణకు యత్నం
గత సర్కారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రసా ద్ నిధుల కోసం ప్రయత్నాలు చేసింది. రామాయణం థీమ్ పార్కు, రామాయణం ఇతివృత్తాంతాలపై లేజర్‌షో, కల్యాణమండపం, వంటశాల (పోటు) ఆధునీకరణ, కరకట్టపై టవర్ హౌజ్, శాశ్వత లైటింగ్, పడమర, దక్షిణ మెట్ట ఆధునీకరణ, డార్మెటరీ హాళ్లు, సౌండ్ సిస్టమ్ ఇలా.. భద్రాచలం వచ్చిన రాష్ట్ర అధికార బృందం డిటైల్డ్ ప్రాజె క్టు రిపోర్టు (డిపీఆర్) తీసుకొంది. ఈ రిపోర్టును ఢిల్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేసి సెంట్రల్ టూరిజం నుంచి రూ.50 కోట్లు తేవాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది.
రామాయణం సర్క్యూట్‌లో భద్రాచలం
2016లో కేంద్ర పర్యాటక శాఖ స్వదేవీ దర్శన్ పేరిట రామాయణం సర్క్యూట్‌లో భద్రాచలంను చేర్చింది. రూ.500 కోట్ల ప్రాజెక్టులో భద్రాచలం అభివృద్ధికి రూ.30 కోట్లు కేటాయించారు. 9 రాష్ట్రాలు, 15 రామాయణంతో ముడిపడి ఉన్న ప్రాంతాలను కలుపుతూ పిల్‌గ్రిమ్ ట్రైన్‌ను నడి పింది. అందుకోసం ఆయా క్షేత్రాల్లో సౌకర్యాలను కల్పించేందుకు నిధులు కేటాయిం చారు. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం కనీ సం డీపీఆర్ కూడా ఇవ్వలేదు. మేమే అభివృద్ధి చేసుకొంటామని ధీమా వ్యక్తంచేస్తూ వాటిని పట్టించుకోలేదు. అప్పుడే తీసుకొం టే కొంతలో కొంతైనా అభివృద్ది జరిగేదని భక్తులు అభిప్రాయ పడుతున్నారు.
ఒక్క సంవత్సరమే రామయ్యకు ముత్యాల తలంబ్రాలు
భద్రాద్రి అభివృద్ధి మాట అటుంచి, కనీ సం తానిషా సంప్రదాయం ప్రకారం శ్రీరామనవమికి స్వామివారికి అప్పటి సీఎం కేసీ ఆర్ ఒకే ఒక్కసారి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు తెచ్చారు. మిగతా ఎనిమిదేళ్ల కాలంలో ఏనాడు ఆయన ఆవైపు రాలేదు. ఒకసారి తన మనువడిని పంపి అబాసుపాలయ్యారు.
నిధులు కేటాయింపునకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు
2023 అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం అభివృద్ధి ప్రదాన అంశంగా ప్రచారం సాగిం ది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం భద్రాచలానికి నిధులు కేటాయించడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలి సింది. రాష్ట్రస్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభ కార్యక్రమం భద్రాచలంలోనే చేశా రు. దానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి కొండా సురే ఖ, ఉమ్మడి ఖమ్మ జిల్లా మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.
ఇళ్ల ప్రారంభోత్సవ అనంతరం భద్రాచలం మార్కెట్ కమిటీలో భద్రాచల దేవాలయ అభివృద్ధిపై ఉన్నతస్థాయి అధికారుల సమీ క్షా సమావేశం నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి నివేదిక సమర్పించాలని, అందుకు అనుగుణంగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం నివేదికలు తయారు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. తాజాగా దేవాలయం పరిసరా ల్లో విస్తరణకు అవసరమైన 84 ఇళ్లు తొలగించాల్సి వస్తుందని, అందుకు రూ.40 కోట్లు అవసరం ఉంటుందని ప్రాథమిక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపి నట్టు సమాచారం. ఇటీవల దేవదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, ఆర్కిటిక్ సూర్యనారాయణమూర్తి భద్రాచలం వచ్చి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పరిశీలించారు. ఇళ్లు కోల్పోతున్న యజమానులతో సమావేశం నిర్వహించారు.
పట్టించుకోని బీఆర్‌ఎస్ సర్కార్
భద్రాచలం అభివృద్ధికి రూ.౧౦౦ కోట్లు కేటాయిస్తున్నామని, మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించామని చెప్పిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాటలతోనే కోటలు కట్టింది. ౨౦౧౬లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.౧౦౦ కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించి, త్వరలో వచ్చి వారం రోజులపాటు భద్రాచలంలోనే ఉండి అన్ని విధా ల భద్రాచలం అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. అయితే అందులో చిల్లిగవ్వ కూడా ఆలయానికి ఇవ్వలేదని తెలిసింది. అటు ఆలయ అభివృద్ధి కోసం చినజీయార్‌స్వామి, ఆర్కిటెక్ ఆనందసాయి అనేక సార్లు భద్రాచలం వచ్చి వివరాలు తీసుకొని మాస్టర్ ప్లాన్ తయారు చేసి కేసీఆర్‌కు అందజేశారు. ఏళ్లు గడిచినా ఆలయ అభివృద్ధి మాత్రం జరుగలేదు.
భక్తుల విరాళాలతో నిర్వహణ
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు హుండీల్లో వేస్తున్న విరాళాలతో దేవాలయ నిర్వహణ సాగు తోంది. ప్రస్తుత అధికారులు అనేక సంస్కరణలు తెచ్చి, ఆదాయ వనరులు పెంచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేపట్టారు. ప్రధానంగా స్వామివారికి ఆన్‌లైన్ టికెట్ దర్శన విధానం, ఆన్‌లైన్ అకామిడేషన్, బ్రేక్ దర్శనం ద్వారా ఆదాయం పెంచుతున్నారు. గత ఏడాదిన్నర కాలంలో వివిధ రకాల విరాళాల ద్వారా ఆలయానికి రూ.60 కోట్ల వరకు వచ్చినట్టు తెలుస్తోంది.
దీంతో సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని పరిస్థతి నుంచి నేడు వేతనాలతోపాటు ఇతర బిల్లులు కుడా చెల్లించి, పెండింగ్ లేని పరిస్థితికి చేరుకొంది. పురుషోత్తంపట్నంలో ఉన్న 890 ఎకరాల భూమి దేవాలయం స్వాధీనం అయితే ఆలయానికి అవసరమైన మామిడాకులు, తులసీదళం, పుష్పాలు, ఆరటి తోటల పెంపకం చేపట్టాలని, గోశాల అభివృద్ది వాటిద్వార నెయ్యిని సేకరించే పూజకు అవసరమైన సామగ్రిని స్వంతంగా సిద్ధంచేసుకోవడం ద్వారా ఖర్చు తగ్గించుకొని ఆదాయాన్ని పెంచే యోచనలో దేవాలయ అధికారు లు యోచిస్తున్నారు. దాత జీఎంఆర్ సహకారంతో రూ. కోటితో భక్తులు దర్శ న సమయంలో ఎండ, వాన నుంచి ఇబ్బంది పడకుండా శాశ్వత షెడ్డు నిర్మాణం చేశారు.
చాలీచాలని వసతులు
పవిత్ర పుణ్యకేత్రమైన భద్రాచలం వచ్చే భక్తులకు సౌలతులు అంతంత మాత్రమే అని చెప్పాలి. మొత్తం 23 కాటేజీలు,17 డబుల్ బెడ్‌రూంలు, 6 సింగిల్ బెడ్‌రూం లు మొత్తం 120 గదులు మాత్రమే ఉన్నా యి. నిత్యం వేలాది మంది భక్తులు రామ య్య దర్శనం కోసం వస్తుంటారు. దీనికి తోడు ముక్కోటి ఏకాదశి, శ్రీరామనవమి సమయాల్లోనైతే భక్తులకు గోదావరి ఇసుక తిన్నెలే పట్టుపరుపులు. గతంలో రామాయణమ్ థీమ్ పార్కుకు కేటాయించిన 11.76 ఎకరాల్లో కాటేజీలు దాతల ద్వారా నిర్మించాలని ప్రయత్నించారు. అనుమతు లు రాకపోవడంతో ముందుకు సాగలేదు. దీంతో రామాయణం థీమ్ పార్కు ఒక కలగానే మిగిలింది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఏపీ టూరిజం ద్వారా రూ.2 కోట్లు కేటాయించారు. కడప నుంచి పెద్ద పెద్ద శిలలు తెప్పించారు. ఈలోగా రాష్ట్ర విభజన కావడంతో కేటాయించిన 11.76 ఎకరాల భూమికాస్తా ఆంధ్రాలో విలీనమైంది. దీంతో పనులకు అడ్డుకట్ట పడింది.