calender_icon.png 16 March, 2025 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాస్మెటిక్స్ ఎలా వాడాలంటే..

16-03-2025 12:13:53 AM

అందంగా కనిపించాలని చాలారకాల కాస్మెటిక్స్ మనం కొంటూ ఉంటాం. కానీ వాటి నాణ్యతను, వాడే విధానాన్ని అంతగా పట్టించుకోం. దీనివల్ల చర్మ సమస్యలు వస్తాయి. అలా కాకుండా ఉండాలంటే నాణ్యమైన ఉత్పత్తులే వాడాలి. కొనేముందు వాటి ఎక్స్‌పైరీ తేదీలను గమనించాలి. అసలు ఏ ఉత్పత్తులను ఎంతకాలం వాడాలో ఇప్పుడు చూద్దాం..

* లిప్‌స్టిక్, లిప్‌లైనర్, లిప్‌గ్లాస్ జీవితకాలం ఏడాదే ఉంటుంది. ఇవి కాస్త పొడారినట్లు కనిపిస్తే పాడవుతున్నాయని గుర్తించాలి. వీటిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఎక్కువకాలం పాడవకుండా ఉంటాయి.

* మస్కారా జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని ఇతరులతో పంచుకోవడం మానేయాలి. ఇది ఎక్స్‌పైర్ అవ్వగానే పక్కన పెట్టేయాలి. లేదంటే కంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. 

* ఫౌండేషన్‌ను సాధారణంగా ఏడాది వరకూ వాడుకోవచ్చు. అది పొడారకుండా, లోపలికి సూక్ష్మక్రిములు చేరకుండా వాడాలి. చేతులతో తాకకుండా కావాల్సినంత ఫౌండేషన్‌ని చేతి మీద వేసుకుని వాడుకోవాలి. గాలిపోకుండా మూత బిగుతుగా పెట్టాలి. 

* ఐబ్రో పెన్సిళ్లను ఎప్పటికప్పుడు చెక్కుతాం. కనుక వాటితో ఏ సమస్యా ఉండదు. కాటుకను పెట్టేటప్పుడు తప్పనిసరిగా చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. వాటి మూతలు ఊడిపోకుండా చూసుకోవాలి. లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. 

* నెయిల్ పాలిష్.. దీన్ని ఏడాది నుంచి రెండేళ్ల వరకూ వాడుకోవచ్చు. పెచ్చులుగా ఊడుతున్నా, తరచూ గడ్డకడుతున్నా.. వాటిని వాడకపోవడమే మేలు. దీన్ని కూడా ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువకాలం ఉంటుంది. 

ఇవి గుర్తుంచుకోవాలి.. 

ఎక్స్‌పైరీ డేట్లు కాస్మెటిక్స్ పైన కాకుండా, ప్యాకేజింగ్‌ల మీద ముద్రించి ఉంటాయి. కాబట్టి వాటిని పారేసే ముందు, ఈ డేట్లను గమనించాలి. ఒకవేళ కాస్మెటిక్స్ ఎక్స్‌పైరీ డేట్ గురించి అయోమయం ఉంటే, అవి పాడైపోయాయని నిర్థారించుకోవడం కోసం వాటిలో తేడాలను గమనించాలి. వాటి నుంచి మంచి వాసన రావడం లేదంటే వెంటనే వాటిని పారేయాలి.