- పగలంతా సేకరణ.. రాత్రివేళల్లో తరలింపు
- జిల్లాలో ఇప్పటి వరకు 930కేసులు
- పీడీ యాక్టు పెడుతున్నా భయపడని అక్రమార్కులు
మంచిర్యాల, జూలై 4 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో పీడీఎస్ బియ్యం దందా జోరుగా సాగుతున్నది. బియ్యం వ్యాపారం చేసే వ్యక్తులపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తున్నా మార్పు రావడం లేదు. జిల్లా వ్యాప్తంగా 423 రేషన్ దుకాణాల ద్వారా 2,19,161 రేషన్‌కార్డుల మీద 6,38,524 యూనిట్లకు బియ్యం సరఫరా చేస్తున్నారు. ప్రతి నెలా 15,412 ఏఎఫ్‌ఎస్‌సీ కార్డుదారులకు 47,207 యూనిట్లకు 5,39,420 కిలోల బియ్యం, 2,03,590 ఎఫ్‌ఎస్‌సీ లబ్ధిదారులకు 5,91,157 యూనిట్లకు 35,46,942 కిలోల బియ్యం, 159 ఏఏపీ లబ్ధిదారులకు 160 యూనిట్లకు 1,590 కిలోల బియ్యం పౌరసరఫరాల శాఖ ఉచితంగా పంపి ణీ చేస్తుంది. ఈ బియ్యా న్ని లబ్ధిదారుల నుంచి సేకరించి కొంత మంది బ్రోకర్లు, మిల్లర్లు కలిసి రీ సైక్లింగ్ చేసి యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
బృందాలుగా ఏర్పడి బియ్యం సేకరణ
రేషన్ దుకాణాల్లో ఈ పాస్ మిషన్లు రాకముందు రేషన్ డీలర్ల నుంచే నేరుగా బియ్యం మిల్లులకు చేరేది. ఈ పాస్ మిషన్‌లు వచ్చాక రేషన్ డీలర్లు బయోమెట్రిక్ మిషన్‌ల ద్వారా కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. లబ్ధిదారులు తీసుకెళ్లిన బియ్యాన్ని అక్రమార్కులు జిల్లాలో బృందాలుగా ఏర్పడి సేకరిస్తున్నారు. కొనుగోలు చేసిన బియ్యాన్ని ఆటోలలో మిల్లులకు తరలించి రీ సైక్లింగ్ చేసి తిరిగి సంచుల్లో నింపి రాత్రికి రాత్రే లారీలు, డీసీఎం వ్యాన్‌లలో లోడ్‌చేసి రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. కొందరైతే రేషన్ దుకాణం నుంచే నేరుగా వాహనాల్లో లోడ్ చేసి రాష్ట్రాలు దాటిస్తున్నారు. పేద వర్గాలకు అందించాల్సిన ఫోర్టిఫైడ్ పీడీఎస్ బియ్యాన్ని జిల్లా దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
తక్కువకు కొని, ఎక్కువకు అమ్మకం
జిల్లాలోని అన్ని మండలాల్లో వాడవాడకూ తిరుగుతూ తక్కువకు బ్రోకర్లు కొనుగోలు చేస్తున్నారు. కిలో రూ.15 నుంచి 18 రూపాయలు లబ్ధిదారులకు చెల్లించి రూ.22కి బడా బ్రోకరుకు విక్రయిస్తుంటారు. ఇలా కిలోకి పది రూపాయల చొప్పున క్వింటాలుకు వెయ్యి రూపాయల లాభం బడా బ్రోకర్(మిల్లర్)కు వస్తుంది. ఈ లెక్కన ఒక లారీలో 200 క్వింటాళ్లు (20 టన్నులు) బియ్యం తరలిస్తే లారీకి రెండు లక్షల రూపాయలు లాభం వస్తుంది. ఇలా ఒక నెలలో దాదాపుగా వంద సంఖ్యలో లారీలు, డీసీఎం వ్యానులలో పీడీఎస్ బియ్యం రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది.
కేసులు పెడుతున్నా భయపడని అక్రమార్కులు
అక్రమ దందాను అడ్డుకునేందుకు పోలీసు, ఎన్‌ఫోర్సుమెంటు, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నా అక్రమార్కులు జంకడం లేదు. శిక్షలు కఠినంగా లేకపోవడంతో వారు జరిమానాలు కట్టి తిరిగి అదే దందాను కొనసాగిస్తున్నారు. ఈ దందాలో తక్కువ కష్టంతో ఎక్కువ లాభం వస్తుండడంతో ఈ వ్యాపారానికి అలవాటు పడిన అక్రమార్కులు దీనినే వృత్తిగా కొనసాగిస్తున్నారు. డీలర్లపై, రీ సైక్లింగ్ చేసే మిల్లర్లపై, గ్రామాల్లో, పట్టణాల్లో తిరిగి బియ్యం సేకరించే వారిపై కఠిన శిక్షలు విధిస్తే ఏమైనా మార్పు వచ్చే అవకావం ఉంది.
930 కేసుల్లో 19,562.13 క్వింటాళ్ల బియ్యం సీజ్
జిల్లా ఏర్పడిన నాటి నుంచి 2024 జూన్ నెలాఖరు వరకు 930 కేసులు నమోదు కాగా 19,562.13 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. బియ్యం తరలిస్తున్న 385 వాహనాలు పట్టుబడగా, రేషన్ షాపుల్లో బియ్యం నిల్వలో తేడా ఉన్న 125 షాపులపై అధికారులు కేసు నమోదు చేసి సీజ్ చేశారు. అధికారులను, పోలీసులను చూసి బియ్యాన్ని అక్కడే వదిలేసిన సందర్భాల్లో 431 అన్ క్లేమ్‌డ్ కేసులు నమోదయ్యాయి.