గుదిబండలా గత ప్రభుత్వ బకాయిలు
మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ సర్కారు
విద్యుత్తు శాఖకు చెల్లించాల్సిన సొమ్ము రూ.28 వేల కోట్ల పైనే
ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1,200 కోట్లు
ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.7 వేల కోట్లు
పంచాయతీ బిల్లులు రాక సర్పంచ్‌ల ఆత్మహత్యలు!
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా వ్యయ ప్రయాసల కోర్చి రుణమాఫీ అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి.. గత సర్కారు చెల్లించకుండా మిగిల్చిన బకాయిలు గుదిబండలా మారాయి. బీఆర్‌ఎస్ హయాంలో వివిధ శాఖలకు చెల్లించాల్సిన బకాయిలను సకా లంలో చెల్లించకపోవడంతో భారీగా పేరుకుపోయాయి. అవి దాదాపు రూ.30 వేల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. కానీ, మరో రూ.10 వేల కోట్లు ఎక్కువే ఉన్నట్టు తెలుస్తోంది.
ఆరు గ్యారంటీల అమలు కోసం నిధుల సమీకరణ ఎలా చేయాలి అని ఆలోచిస్తున్న ప్రభుత్వానికి.. గత బకాయిలు తలనొప్పిగా మారాయి. సాధారణంగా గత సర్కా రు బకాయిలు.. ప్రస్తుత సర్కారుకు బదిలీ అవుతాయి. వాటిని ఎప్పటికప్పుడు చెల్లిస్తే ఆ భారం తర్వాత వచ్చే సర్కారుపై ఎక్కువ పడదు. కానీ ఇక్కడ అలా జరగలేదు. తెలంగాణ ఏర్పడే నాటికి విద్యుత్తు శాఖకు ప్రభుత్వ బకాయిలు రూ.1,268 కోట్లు ఉండగా.. పదేళ్లలో రూ.28 వేల కోట్లకు పెరిగినట్టు సర్కారు గణాంకాలు చెప్తున్నాయి. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో అన్ని శాఖల్లో పాత పద్దులు భారీగా పేరుకుపోయాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నాలుగు లక్షల బిల్లులు పెండింగ్‌లో..
గత ప్రభుత్వం పదేళ్లలో పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది. రైతులకు ఉచిత విద్యుత్తు, ఆర్టీసీ రాయితీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యార్థులకు మెస్ చార్జీలు, సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులకు సంబంధించిన బిల్లులు, ఆరోగ్యశ్రీ.. ఇలా పలు శాఖలకు సంబంధించిన బిల్లులు ఆర్థిక శాఖ వద్ద దాదాపు 4లక్షలు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. వీటిని మొత్తం లెక్కేస్తే.. రూ.40వేల కోట్లు దాటుతుందని సమాచారం.
ఒక్క విద్యుత్తు శాఖకు రూ.28 వేల కోట్ల పైనే..
ప్రభుత్వం అత్యధికంగా విద్యుత్తు శాఖకు బకాయి పడింది. రేవంత్‌రెడ్డి సర్కారు ఏర్పడిన తర్వాత విద్యుత్తు శాఖపై సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రభుత్వం నుంచి డిస్కంలకు రావాల్సిన బకాయిలు రూ.28 వేల కోట్ల పైనే ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఇందులో కేంద్ర ప్రభుత్వ బకాయిలు ఓ రూ.700 కోట్ల వరకు ఉన్నాయి. ఇంత మొత్తంలో విద్యుత్తు శాఖకు బకాయి పడటం వల్ల.. ఆ రంగం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద దాదాపు రూ.7వేల కోట్లు, ఆరోగ్య శ్రీ కింద రూ.1200 కోట్లు, ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలు రూ.750 కోట్ల వరకు ఉన్నట్టు తెలుస్తోంది. ఇవికాక వృద్ధులు, జర్నలిస్టులు, వికలాంగులు, విద్యార్థులకు బస్‌పాస్ రాయితీలను కూడా కలుపుకొంటే వందల కోట్లలో పేరుకుపోయాయి.
సర్పంచ్‌ల ఆత్మహత్యలు
2019-23 మధ్య కాలంలో గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక చాలామంది సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చెప్పిందని కొందరు అప్పులు తెచ్చి, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, రోడ్లు నిర్మించారు. ఆ బిల్లులను నాటి ప్రభుత్వం సకాలంలో చెల్లించలేదని మాజీ సర్పంచులు వాపోతున్నారు. 2019-23 మధ్య కాలంలో దాదాపు రూ.1200 కోట్లను చెల్లించాల్సి ఉందని, ఆ మొత్తాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాలని మాజీ సర్పంచులు కోరుతున్నారు.
బిల్లులు రాక, వడ్డీలు పెరిగి, అప్పులు ఎక్కువై, మనోవేదనతో కొందరు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే విషయాన్ని ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పంచాయతీలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేయగా, స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు.. బీఆర్‌ఎస్ హయాంలో బిల్లులు రాక సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు అప్పుల పాలయ్యారని, ఆత్మహత్యలు చేసుకు న్నారని మండిపడ్డారు.