23-02-2025 12:00:00 AM
ప్రస్తుతం టెక్నాలజీ చాలామందికి చేరువైంది. ఈ క్రమంలో వ్యక్తిగత, ఉద్యోగ అవసరాలకు ల్యాప్‌టాప్, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వినియోగం పెరిగింది. అయితే చాలామంది రోజులో ఎక్కువ సమయం డిజిటల్ స్క్రీన్ మీదే గడపాల్సి వస్తోంది. దాంతో కంటి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. కంటి చూపు సన్నగిల్లడం, వివిధ కంటి సమస్యలకు దారితీస్తోంది. అయితే కళ్ల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం..
పోషక విలువలు: కంటి ఆరోగ్యం మెరుగుపర్చుకోవడంలో ఆహారం చాలా కీలకం. మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూర, క్యారెట్ వంటి ఆకుకూరలు డైట్‌లో చేర్చుకోవాలి. వీటిలో ఖనిజాలు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలను కూడా తరచూ తీసుకోవాలి. దీంతో కంటి పనితీరు మెరుగుపడుతుంది.
స్మోకింగ్ వద్దు: స్మోకింగ్ కంటి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ అలవాటు మితిమీరితే వివిధ రకాల కంటి సమస్యలు వస్తాయి. ప్రధానంగా కంటి నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో కంటిచూపు మందగించే అవకాశం ఉంది. కాబట్టి కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే స్మోకింగ్‌కు దూరంగా ఉండాల్సిందే.
డిజిటల్ డిటాక్స్: స్క్రీన్ మీద ఎక్కువ సమయం గడిపేవారు తప్పనిసరిగా 20- నియమాన్ని పాటించడం మంచిది. ఈ నియమం ప్రకారం ప్రతి 20 నిమిషాలకు స్క్రీన్ నుంచి కొంత విరామం తీసుకోవాలి. దాదాపు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుపై 20 సెకన్ల పాటు దృష్టి కేంద్రీకరించాలి. దీన్ని తరచూ ప్రాక్టీస్ చేస్తే కంటి కండరాలకు తగినంత విశ్రాంతి లభిస్తుంది. కంటి అలసట కూడా తగ్గుతుంది.
తగినంత నిద్ర: మనిషి ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. రోజూ తప్పనిసరిగా ఎనిమిది గంటలు నిద్రపోవాలి. రాత్రిపూట సరిగ్గా నిద్రపోతే కళ్లకు ఎంతో విశ్రాంతి లభిస్తుంది. ఇది కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది. బాగా విశ్రాంతి తీసుకున్న కళ్ల పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది. భవిష్యత్తులో దృష్టి సమస్యల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది.