calender_icon.png 17 September, 2024 | 1:44 AM

విపత్తులను ఎదుర్కొనే విధానం

10-07-2024 12:05:00 AM

తావద్ భయేషు భేతవ్యం

యావత్ ద్రయమనా గతమ్

 ఆగతంతు భయం దృష్ట్వా

గ్రహర్తవ్యమ శంకయా!

 చాణక్య నీతి  53

“ఆపదలు సంభవిస్తాయని ఖచ్చితంగా తెలిసినా, అవి దూరంగా ఉన్న సమయంలో కొద్దిగా భయపడినా ఆ ఇబ్బందులు కమ్ముకు వచ్చినప్పుడు మనసులో ఏ విధమైన అనుమానాన్నీ పెట్టుకోకుండా వాటిని అధిగమించే ఉపాయాలు ఆలోచించాలి. ధైర్యంతో వాటిని ఎదుర్కోవాలే కాని భయపడకూడదు” అని అంటారు ఆచార్య చాణక్యులు. 

ఈ ప్రపంచంలో విపత్తులు లేని ప్రదేశం ఉండదు. మనలో కూడా ధైర్యం, భయం రెండూ ఉన్నాయి. ఈ రెండూ మనసుకు సంబంధించిన భావోద్వేగాలే. ఒక దానిని అంటి పెట్టుకొని మరొకటి ఉంటుంది. అయితే, దేనిని మనం ఆదరిస్తామనే దానిపైనే మన పురోగతి లేదా తిరోగతి ఆధారపడి ఉంటుంది. ఆపదలు దూరంగా ఉన్నప్పుడు, అవి మనల్ని పలకరించే అవకాశం ఉన్నదని మనం భావించినప్పుడు, అవి మనల్ని చుట్టుముడుతాయేమోననే భయం కొద్దిగా ఉంటే ఉండవచ్చుగాని ఆపదలు ముంచుకొచ్చాక భయపడి ప్రయోజనం లేదు. మన ముందు రెండు మార్గాలు వున్నాయి.

ధైర్యంతో ఎదుర్కోవడం లేదా పారిపోవడం. ఈ ప్రపం చంలో భయం లేని ప్రదేశం లేదు కనుక పారిపోయినా అవేమీ మనలను వదలవు. పైగా భయగ్రస్తుడైనవాడు ఒత్తిడికి లోనవుతాడు. ఒత్తిడివల్ల నిర్ణయాలు సరిగా తీసుకోలేం. అసమంజసమైన నిర్ణయాలవల్ల అపజయం ప్రాప్తిస్తుంది. కాబట్టి, ‘భయాన్ని జయించాలని’ అంటాడు చాణక్యుడు. జయించడం అంటే అధిగమించడమే. అధిగమించాలంటే ఆ భయం స్వరూప స్వభావాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మార్గాలు, ఉపాయాలను అన్వేషించాలి. అప్పుడే ఏ మార్గం ద్వారా దానిని అధిగమించడానికి అవకాశం ఉంటుందో అవగతమవుతుంది.

ఈనాటి వ్యాపార రంగంలో కూడా రెండే మార్గాలు ఉన్నాయి. చేపట్టిన కార్యంలో నిన్ను నీవు నిరూపించుకో లేదా ఆ రంగం నుండి తప్పుకో. సాధారణ పని నైపుణ్యాలు గణితింపబడే రోజులు పోయాయి. సంస్థ ఆశించిన దానికన్నా ఉత్తమ ఫలితాలు ఇవ్వగలిగిన వారే రంగంలో నిలువ గలుగుతారు. పెద్దలైనా, యువత అయినా దీనికి భిన్నంగా విజయ సాధకులు కాలేరు. కొత్త ఆలోచనలు చేయాలి. వాటిని కార్యరూపంలోకి అనువదించుకోవాలి. బాధ్యతలు నిర్వహించి హక్కులను సాధించుకోవడమే. 

ఇదే తరుణోపాయం

ఉత్సాహం ప్రేరణనిస్తుంది. సాహసం ముందడుగు వేయమంటుంది. ధైర్యం మానసిక సమతుల్యతను ప్రసాదించి సక్రమమైన ఆలోచనలను కలిగిస్తుంది. బుద్ధి మంచిచెడులను, వివేకాన్ని అందిస్తుంది. ఏది యుక్తమో, ఏది హానికరమో, దేనివల్ల తాత్కాలిక ప్రయోజనం కలుగుతుందో, ఏది శాశ్వత ప్రయోజనకారియో తెలియచేస్తుంది. ఆ మేరకు ఆసక్తినీ రేపుతుంది. శక్తివల్ల మనపై మనకు సాధించగలమనే విశ్వాసం ఏర్పడుతుంది. ఏ అవాంతరాన్నైనా అధిగమించ గలమనే నమ్మకం ఎంతటి అసాధ్య కార్యాన్నైనా అవలీలగా సాధించగలిగే చైతన్యాన్ని ఇస్తుంది.

బుద్ధి దారిని చూపితే, ఉత్సాహం ప్రేరణను అందిస్తే, ధైర్యం పరిణామాలను విశ్లేషిస్తే, సాహసం ఊపిరులూదితే, శక్తివంతమైన చైతన్యం ‘నేనున్నానని’ తోడుగా నిలిస్తే సాధించాలనే తపనతో ముందడుగు వేసేవారికి అపజయం, భయం లాంటివి ఎన్నడూ ఎదురవవు, పలకరించవు కూడా. బుద్ధిమంతులకు, సాధించాలనే తపన వున్న వారికిదే శక్తివంతమైన మార్గం, విపత్తులను అధిగమించే మంత్రమని ప్రబోధిస్తున్నారు చాణక్యులు.

భయాన్ని గురించి కీ.శే. గురజాల గోపాల కృష్ణయ్యశాస్త్రి ఒకమాట చెప్పేవారు. ‘ఆపదలు రానంత వరకు వస్తాయని ఆలోచించడం, భయపడడం వల్ల ప్రయోజనం లేదు. ఒకవేళ వస్తే, వచ్చాక అయితే అనుభవించాలి లేదా వాటిని అధిగమించాలి. అంతేకాని, వచ్చాయ ని విచారించడం వల్ల ఉపయోగం ఉండదు’. కాబట్టి, ఎప్పుడో ఏదో జరుగుతుందని భయపడుతూ కూర్చోవడం విజ్ఞత కాదు. ఉపా యాలు వెదుకుతూ,  లోపం లేకుండా ప్రయ త్నం చేస్తూ, ఫలితాన్ని భగవంతునికే వదిలేయాలనేవారు. వివేకానంద స్వామికూడా యువతను గురించి అన్నమాట ఇక్కడ సందర్భోచితం, ‘యూత్ ఆర్ నాట్ యూస్లెస్, దె ఆర్ యూస్డ్ లెస్’. ఈ మాటలు అక్షర సత్యం.