పాలకుర్తి రామమూర్తి :
విజిగీషుః పరగ్రామ మవాప్తుకామః
సర్వజ్ఞ దైవత సంయోగ ఖ్యాపనాభ్యాం
స్వపక్ష ముద్ధర్షయేత్ పరపక్షం చోద్వేజయేత్
్ర చాణక్య అర్థశాస్త్రం (దుర్గలంబోపాయం 13.1.1)
“శత్రువు గ్రామాలను, నగరాదులను ఆక్రమించాలనే లేదా జయించాలనే కోరిక కలిగిన వారు తనకు అన్నీ తెలుసుననీ, దేవతలతో తనకు ప్రత్యక్ష సంబంధం ఉన్నదనీ చాటి, తన పక్షం వాళ్లని ప్రోత్సహించాలి. శత్రుపక్షం వాళ్లకి భయం కలిగించాలి” అంటున్నాడు కౌటిల్యుడు.
మనుషులలో ఇతరులపైన ఆధిపత్యాన్ని సాధించాలనేది సహజమైన కోరిక. అది మం చిదా కాదా? అనేది వేరే విషయం. ఒకసారి ఆ ఆలోచన వచ్చాక ఆ మార్గంలో ప్రణాళిక రచించుకోవాలి. అలా ఆలోచన రావడం ఇచ్ఛ. దానినే ‘ఇచ్ఛాశక్తి’ అంటాం. ఆ కోరిక బలమైన వేళ దానిని సాధించే క్రమంలో అవసరమైన జ్ఞానాన్ని పొందాలి. అంటే, ఎలా వెళ్ళాలి, ఎవరి సహాయ సహకారాలు తీసుకోవాలి, ప్రణాళికలు రచించుకోవడం ఎలా, అవసరమైన నైపుణ్యాన్ని మనం సాధించడమా లేదా నైపుణ్యం కలిగిన వారి సహాయా న్ని తీసుకోవడమా లాంటి వివిధాంశాలపై తగిన, సమగ్ర మైన జ్ఞానాన్ని సంపాదించాలి.
దానినే ‘జ్ఞానశక్తి’ అంటాం. ఆ ఆలోచనను అమలు చేయడమే ‘క్రియాశక్తి’. పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రచించుకొని దాని ప్రకారం నడుచుకోవడం అవసరం. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తుల సమ్మేళనమే విజయం. దీనిని సాధించే క్రమంలో అనుయాయులను ప్రోత్సహించడం, వారి చుట్టూ అలాంటి వాతావరణాన్ని సృష్టించి క్రియాశీలురను చేయడం ద్వారా వారిలో సకారాత్మక ఉత్సాహాన్ని, నమ్మకాన్ని కలిగించిన వారమవుతాం. అదే సమయంలో ఎదుటివారిలో భయాన్నీ నింపాలి. అప్పుడు మన శక్తి సామర్థ్యాలు ఎదుటివారికన్నా తక్కువే అయినా గెలుపు మనదవుతుంది.
ప్రేరణ అంతర్గత శక్తిని నిద్ర లేపుతుంది!
ఒక రాజువద్ద ఓ ఏనుగు ఉండేది. అది ఎన్నో యుద్ధాలలో పాల్గొని విజయాన్ని సాధించింది. రాజుకు దానిపై అమితమైన ప్రేమ ఉండేది. కాలక్రమంలో అది ముదుసలిదైంది. ఒకనాడు అదొక ఊబిలో దిగబడి, ఎంత ప్రయత్నించినా బయటికి రాలేక పోతున్నది. రాజుగారు అది చూసి బాధ పడ్డాడు. మంత్రి రాజుకు ఒక ఉపాయం చెప్పాడు. అప్పుడు రాజు యుద్ధంలో ఉపయోగించే భేరీ నినాదాలు తెప్పించి పెద్దగా చప్పుళ్ళు చేయించాడు. సైనికులతో వీరాలాపాలు చేయిస్తూ అక్కడొక యుద్ధ వాతావరణాన్ని సృష్టించాడు.
ఇవన్నీ వింటున్న ఏనుగు తానున్నది యుద్ధరంగమని భావించింది. తన పూర్తి శక్తి సామర్థ్యా లను వినియోగించి బయటికి వచ్చే ప్రయత్నం చేసింది. దానిని ప్రోత్సహిస్తున్న సైనికుల కవాతులవల్ల అది త్వరగానే ఊబినుండి బయటకు వచ్చింది. నిజానికి ఆ ఏనుగుకు ఊబినుండి బయటకు రాగలిగిన శక్తి సామర్థ్యాలు అప్పటికప్పుడు పుట్టుకొచ్చినవి కావు. ముందు నుండీ ఉన్నవే. కానీ, తనకు ఆ వాతావరణంతో కూడి న ప్రోత్సాహం కరవయింది. దానితో స్తబ్ధుగా మారిపోయింది. ఎప్పుడైతే తనకు పరిచితమైన శబ్దాలను విన్నదో అప్పుడు తనను తాను ఉన్నతీకరించుకోగలిగింది. ప్రేరణను పొంది తన ప్రయత్నంలో విజయాన్ని సాధించింది.
అనుచరుల కార్యనిర్వహణా దక్షత, ధైర్య సాహసాలే నాయకుని విజయానికి గీటురాళ్ళు. నాయకుడు, తన అనుయాయులను ఎలా ప్రోత్సాహ పరచాలో తెలుసుకొని, తదనుగుణమైన ప్రేరణను వారికి ఇవ్వడం వల్ల సానుకూల ఫలితాలను పొందుతాడు. కార్యసాధకుడు, సమాజంలోని ఉన్నతాధికారులు తనకు బంధువులనీ, మిత్రులనీ ప్రచారం చేసుకోవడం వల్ల సాధారణంగా తనను ఎదిరించ డానికి ఎవరూ సాహసించరు. అవకాశం వచ్చిన ప్రతిమారు పెద్దవారిని ఆహ్వానించడం, వారు గుర్తించినా, గుర్తించక పోయినా వారితో తన పరిచయాన్ని ఉన్నతంగా చూపుకోవడం అవసరం. ఆ వైఖరి తన వారిలో నమ్మకాన్ని కలిగిస్తుంది. అలాగే, ఎదుటివారిలో భయాన్నీ నింపుతుంది. కార్యసాధనలో ఈ రెండూ అవసరమే అన్నది చాణక్యుడు బోధించిన నీతిసూత్రం.