calender_icon.png 5 November, 2024 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక భారాన్ని మోసేదెలా?

05-11-2024 12:00:00 AM

గత పాలకులు అనాలోచిత నిర్ణయాలతో, విచ్చలవిడిగా అప్పులు చేసి స్వీయ ప్రయోజనాల కొరకై ఖర్చుపెట్టి  రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారు. తమ వెంట ఉండే రాజకీయ కార్పొరేట్ దిగ్గజాలను, అవినీతి అధికారులను, ఇంకా ఆంధ్రా కాంట్రాక్టర్లను అనతి కాలంలోనే అపర కుబేరులను చేయడంతో  ప్రజల ఆగ్రహానికి గురై తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత అనూహ్యంగా అధికారం కోల్పోయారు. వెనువెంటనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్లు మొండిచేయి చూపించిభారత రాష్ట్ర సమితిని లోక్

సభలో అడుగుకూడా పెట్టనియ్యలేదు.

 లక్షల కోట్ల దుర్వినియోగం

ఓట్లు, ఎన్నికలు, గెలుపు లక్ష్యంగా అనుత్పాదక పథకాలను ప్రవేశపెట్టి లక్షల కోట్ల రూపాయల దుర్వినియోగం చేయడం జరిగిందని ఇటీవల బయల్పడిన ఉదంతాలు తెలియచేస్తున్నాయి. మిషన్ కాకతీయ, భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల కోసం రెండు లక్షల కోట్లతో పాటు భూస్వాములు, రియల్టర్లు,  వ్యాపార భూములకు ఐదేళ్లలో  రైతుబంధు ద్వారా కనీసం 30 వేల కోట్ల రూపాయలు పంచి పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 10 సంవత్సరాలలో 8 వేల కోట్లు అస్మదీయులకు పంపిణీ చేసి 5వేల కోట్లు సొంత మీడియాకు ధారాదత్తంచేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఇప్పటికీ లోకం కోడై కూస్తోంది. పేదల విద్య, వైద్య రంగాలకు నిధుల కోత పెట్టి మానవాభివృద్ధిని మంట కలిపారు.

అవినీతి, దోపిడీ, భూకబ్జాలు, అరాచక, నియంతృత్వ, కుటుంబ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటూ కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన అనేక హామీలను నమ్మి అధికార మార్పిడికి పట్టం కట్టినారు. గత ఏడాది డిసెంబర్ 9న అధికారం చేపట్టిన నూతన ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గమనించి అవాక్కై గందరగోళంలో పడిపోయింది. క్యాబినెట్ సబ్ కమిటీ వేసిన అంచనాల ప్రకారం రూ.7.5 7 లక్షల కోట్ల అప్పు, రూ.50 వేల కోట్ల  బకాయిల చెల్లింపులు ఎదురు  చూస్తున్నాయి.

ప్రతి నెలా కనీసం మూడు వేల యాభై కోట్ల రూపాయలు వడ్డీలు కట్టలేక సర్దుబాటు కొరకు నిత్యం అప్పులకే తిరగవలసి వస్తున్నది. ఇక ఇచ్చిన హామీలను నెరవేర్చేదెలా? అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగేదెలా అనే ప్రశ్నలు పాలకులను, అధికారులను, మేధావి వర్గాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. 25 వేల కోట్ల రూపాయల  రైతు రుణమాఫీలో 18 వేల కోట్ల రూపాయలు చెల్లించినా మిగిలిన రైతులలో అసంతృప్తి మిగిలే ఉంది.

రైతు భరోసా, సన్నవడ్లపై బోనస్, రైతు కూలీలకు, మహిళలకు, వృద్ధులకు సింఛన్లు, ఆడపిల్లల పెళ్లిళ్లకు తులం బంగారంలాంటి హామీలను ఇంకా మొదలు పెట్టలేదు. వెనుకబడిన కులాల విద్యార్థుల ఫీజు రియిబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించలేదు. 

మూసుకుపోయిన అన్నిదారులు

ప్రస్తుతం ప్రభుత్వం అదనపు వనరులను సమీకరించడం కష్టసాధ్యంగా ఏర్పడిం ది. గత ప్రభుత్వం తొమ్మిదేండ్ల కాలంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా రిజిస్ట్రేషన్ చార్జీలు, రోడ్డు రవాణా, భారీ వాహనాల చార్జీలు, మద్యం ధరలుభారీగా పెంచడం జరిగింది.  హైదరాబాద్ చుట్టుపక్కల గల విలువైన వేలాది ఎకరాల భూములను కారుచౌకగా అస్మదీయులకు కట్టబెట్టడం జరిగింది. ఓఆర్‌ఆర్‌ను ముప్ఫు సంవత్సరాలకు  తాకట్టు పెట్టడం జరిగింది. ఇదేవిధం గా అనేక జిల్లాల్లో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారు.

కొన్ని ప్రభుత్వ ఆస్తులను 99 సంవత్సరాల లీజుకు తమ నాయకులకే కట్టబెట్టారు. ప్రభుత్వం మారకముందే రియల్ ఎస్టేట్ శరవేగంగా డీలాపడడం ప్రారంభించినా ఇటీవలి కాలంలో పూర్తిగా స్తబ్దతకు గురి అయింది. ఇక మద్యం దుకాణాల విస్తరణ లేదా మద్యం ధరలను మరింత పెంచడం సాధ్యం కాదు. ఇప్పటికే మద్యంద్వారా రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో పాటు, ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నది. గత ప్రభుత్వ మద్యం పాలసీ పుణ్యాన లక్షల మంది వ్యసనపరులు అకాల మరణం చెంది తండ్రులను పోగొట్టుకున్న పిల్లలు లక్షల్లో  ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితి లేదు.

అదనపు పన్నులు విధించే అవకాశాలు కనిపించడం లేదు. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తేలేరు. తెచ్చినా చెల్లింపుల సమస్య మరింత సమస్యాత్మకంగా మారుతుంది. నూతన ప్రభుత్వం ఇచ్చిన కొత్త హామీలు అమలుపరచడానికి ఆర్థిక వెసులుబాటు లేక ప్రభుత్వం తల పట్టుకున్నది. గత ప్రభుత్వం రిటైర్ అవుతున్న ఉద్యోగుల రిటైర్మెంట్ చెల్లింపులు ఇవ్వలేక అడగకముందే ఉద్యోగ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచడం జరిగింది. ప్రస్తుతం ప్రతినెలా అనేక వందల మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేయడం ద్వారా ప్రభుత్వంపై పెనుభారం పడనుంది.

నూతన ప్రభుత్వం అదనంగా 60 వేలమందికి ఉద్యోగాలు ఇవ్వడం వలన అదనపు ఆర్థిక భారం పడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఐదు కరువు భత్యం వాయిదాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగుతామని ప్రకటించాయి. గత నాలుగైదేళ్లనుండి బకాయిలు పడ్డ బీసీ విద్యార్థుల ఫీజులు దాదాపు 7000 కోట్ల మేరకు చెల్లించక ప్రైవేటు కళాశాలల, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు, యాజమాన్యాలు వీధినబడ్డారు.

ప్రభుత్వ పనులు చేసిన చిన్నా చితక కాంట్రాక్టర్లు తెచ్చిన అప్పులు వడ్డీలు కట్టలేక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినప్పటికీ ప్రయోజనం లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

తెచ్చిన అప్పులు వడ్డీలకే సరి

ప్రస్తుత సంవత్సరం 45 వేల కోట్ల రూపాయలు కొత్త అప్పులు తెచ్చినప్పటికీ 35 వేల కోట్ల రూపాయల పాత అప్పులు, వడ్డీలు మాత్రమే చెల్లించడం జరిగింది. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఇలానే కొనసాగితే అప్పుల భారం తగ్గేడెన్నడు?అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేది ఎప్పుడు ? శ్రీలంక, వెనిజులా దేశాలలో ప్రజలు, ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్నట్లే తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక సంక్షోభం ఎదురవుతున్నట్లు ఉన్నది. ప్రభుత్వ వ్యయాలు పెరుగుతున్నప్పటికీ ఆదాయాలను పెంచుకోలేని పరిస్థితి దాపురించింది.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన విధంగా సహకరించకపోవచ్చు. మూలిగే నక్కపై తాటిపండు లాగా ఆర్థిక వ్యవస్థ పరిస్థితి భయంకరంగా కనిపిస్తున్నది. కాయకల్ప చికిత్స లాంటి సంస్కరణలు చేపట్టనిదే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి తీవ్ర అస్వస్థతకు పడిపోయే ప్రమాదం పొంచి ఉన్నదని మేధావులు, నిపుణులు, ఉద్యమకారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ విపత్కర పరిస్థితి గమనించిన కొంతమంది ప్రతిపక్ష నాయకులు అప్పుడే వీధిన పడుతున్నారు.

తొమ్మిదిన్నరేళ్లపాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిరంకుశంగా ఏలుకొని అన్ని రంగాలను విధ్వంసం చేసి అప్పుల పాలు చేసిన నాయకులే తిరిగి నిత్యం రోడ్డున పడి రాద్ధాంతం చేస్తున్నారు. ఎన్నికల హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని, తప్పు చేశారంటూ ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు.మార్పును కోరుకున్న ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని కొందరు ప్రతిపక్ష నాయకులు ఆవేదన పడుతున్నారు.

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నిధుల కొరత, చెల్లింపుల సంక్షోభం నుండి బయటపడే సంస్కరణలు చేపట్టాలి. దినదినం పెరుగుతున్న ప్రభుత్వ వ్యయాన్ని క్రమబద్ధీకరించవలసిన అవసరాన్ని గుర్తించాలి. ప్రజలపై అదనపు, అధిక భారం పడకుండా పన్నుల వసూళ్లు,  పన్నేతర ఆదా యాలు పెంచుకోవాలి. శ్రమ సాంద్రత కలిగిన ఉత్పత్తి పథకాలను, ప్రాజెక్టులను అమలుపరిచి సాధారణ ప్రజల ఆదాయాలను పెంపొందించే ఆర్థిక వ్యూహాలను అమలు చేయాలి.

అనుత్పాదక పథకాల ను పునః పరిశీలించాలి. కార్పొరేట్ శక్తుల, కాంట్రాక్టర్ల దోపిడీని,అధికారులు, అనధికారుల అవినీతిని నియంత్రించాలి అరిక ట్టాలి. ప్రైవేటు విద్య, వైద్య రంగాలలో జరుగుతున్న అమానుషమైన దోపిడీని అడ్డుకోవాలి. అవినీతి లేని, నాణ్యత గల పరిపాలన అందించినట్లయితే పథకాలు అందలేదని అసంతృప్తి చెందుతున్న ప్రజలు శాంతిస్తారు, ఆశీర్వదిస్తారు.