ఉచితానికి విలువ ఉండదని అం టారు చాలామంది. కానీ, జ్ఞాన సంబంధమైన పుస్తకాలను ఉచితంగానే పంచి పెట్టాలని, అప్పుడే దానికి విలువ, సార్థకత సిద్ధిస్తాయని అనేకమందికి తెలియదు. మహానుభావులు, నా ఆధ్యాత్మిక గురువు అయిన పండిత గోపదేవ శాస్త్రినుంచి పొందిన ఈ బోధ ఎంత అక్షర సత్యమో నాకు అనుభవ పూర్వకంగా తెలిసింది. వారిని ఒకరోజు నేనిలా అడిగాను
“మీరు నాకు ఏడాది కాలం దర్శనాలు చెప్పారు. ఎంతో జ్ఞానం ఇచ్చారు. ఈ జ్ఞానాన్ని నేనెవరికి ఇవ్వాలి? ఎవరు తీసుకుంటారు? తద్వారా మీకు ఎంతగానో ఋణపడ్డాను. మీ ఋణాన్ని ఎట్లా తీర్చుకోగలను? నిజానికి మీరు నాకిచ్చిన జ్ఞానం మళ్లీ జన్మ పొందడానికి కూడా అవకాశం ఇవ్వదు. అలాంటప్పుడు నేను ఎలా ఋణ విముక్తుణ్ణి కాగలను? ముక్తికి మార్గం చూపిన మీనుంచి నేను ఏ విధంగా ఋణవిముక్తి పొందగలను?” వారు అద్భుతమైన సమాధానం ఇచ్చారు.
“నా నుంచి నువ్వు పొందిన జ్ఞానం నిజానికి నాది కాదు, ఋషులది. ఋషికృత గ్రంథాలను మా గురువులు నాకు బోధించారు. ఫలితంగా నేను వేదజ్ఞానాన్ని పొందాను. ఆ జ్ఞానాన్నే నేను నీకు ఇచ్చాను. ‘యోగ దర్శనం’లో ‘పూర్వేషామపి గురుః కాలే నావ వచ్చేదత్’ అనే వాక్యం ఉంది. ‘ఈశ్వరుడే వేద ప్రకాశకులైన ఋషులకు పరమగురువ’ని దీని అర్థం. యథార్థ జ్ఞానం వేదాలనుంచే వస్తుంది. వేదవేద్యుడైన ఈశ్వరుని నుంచే వస్తుంది. అది ఋషుల నుంచి మనకు లభించింది.
జ్ఞానం అందరికీ ఒకటే. కాని, ఎవరి అనుభవం వారిదే. జ్ఞానం వస్తువుకు సంబంధించింది. అనుభవం ఆత్మకు సంబంధించింది. అనుభవాన్నిబట్టి మనం జ్ఞానులుగా లెక్కలోకి వస్తాం. కనుక, నా గురువుల నుంచి నాకు అందిన జ్ఞానమే నీకు లభించింది. కొత్తగా నేను ఇచ్చిందేమీ లేదు. మరి, నేను కూడా వారికి ఋణ పడినట్లే కదా! ఒక విధంగా వారు ఇచ్చిన జ్ఞానాన్ని నేను ఉపయోగించుకోవడం వల్ల ఋణగ్రస్తుడని అయ్యాను.
కానీ, నేను జ్ఞానాన్ని నీలాంటి వారికి ఇవ్వడం వల్ల వారినుంచి నేను ఋణ విముక్తిని పొందిన వాణ్ణయ్యాను. ఇప్పుడు నువు చేయవలసిన పని ఒకటుంది. అదేమిటంటే, నీకు లభించిన జ్ఞానాన్ని ఇతరులకు ఇచ్చి నానుంచి ఋణ విముక్తి పొందవచ్చు. గురూణ విముక్తికి ఇదొక్కటే మంచి మార్గం. ‘న విత్తేన తర్పణీయో మనుష్యః’ అని ‘కఠోపనిషత్తు’ చెబుతుంది. కేవలం ధనంతో ఏ మానవుడూ తృప్తి పొందజాలడని దీని అర్థం.
నువు నాకు ధనం ఇచ్చినా తీసుకోను. నేను ఇప్పుడు సర్వసంగ పరిత్యాగిని. మా నాన్న నాకు అరవై ఎకరాల భూమిని ఇచ్చాడు. కానీ, దాన్ని నేను ఎన్నో ఏళ్ల క్రితమే విడిచిపెట్టాను. లోకంలో ప్రతి వాడు ధనంతోనే సుఖం లభిస్తుందని అనుకుంటాడు. కానీ, ఉత్తమ జ్ఞానమే సుఖాన్ని ఇస్తుంది. సమస్త దుఃఖాల నుంచి మనల్ని విముక్తులను చేస్తుంది. ‘ధనాన్ని, కీర్తిప్రతిష్టలను, సకామకర్మలను ఈ మూడింటిని వదులుకున్నవాడే సన్యాసి’ అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి.
కాబట్టి, నేను ఇచ్చిన జ్ఞానానికి బదులుగా నువ్వు ఏమిచ్చినా నా ఋణం తీరదు. అందుకే, నా నుంచి నేర్చుకున్న విద్యను పదిమందికి పంచిపెట్టు. అందువల్ల నువు తరిస్తావు. ఇతరులు కూడా తరిస్తారు..” అని పండిత గోపదేవ్ వారు ఇచ్చిన ఉపదేశం నేనెప్పటికీ మరిచిపోను.
కేవలం మరిచిపోకుండా ఉండడమే కాకుండా, దాన్ని ఆచరణలో పెట్టాలని చాలావరకు ప్రయత్నించాను. కనుకే, ఎంత దూరమైనా వెళ్లి సనాతన ధర్మాన్ని గురించి ఉపన్యసిస్తున్నాను. ఇంతవరకు 8 ఉపనిషత్ సప్తాహాలు నిర్వహించాను. ప లు టీవీ చానళ్లలో ప్రసింగించాను. యూ బ్యూబ్‌లలో అనేకానేక వేద సంబంధ విషయాలపై మాట్లాడాను. 1996 నుంచి ఇదే పని చేస్తున్నాను. పదవీ విరమణ అనంతరం సమయం బాగా దొరికింది. ఈ సమయాన్ని గ్రంథ, పత్రికా రచనలకు, ప్రసంగాలకు ఉపయోగిస్తున్నాను. ధనాశ లేకుండా వ్యవహరిస్తున్నాను. గురువు ఆదేశం ప్రకారం నడుచుకుంటున్నాను.
సాక్షాత్కరించిన గురువాజ్ఞ
ఇట్లుండగా, 28 ఏళ్ల తర్వాత ఒక సంఘటన జరిగింది. ‘వేదాల ఆవశ్యకత’ అనే అంశంపై ఉప్పల్ ప్రశాంత్‌నగర్‌లో ఏర్పాటైన ఒక కార్యకమ్రంలో వేదాల వైశి ష్ట్యాన్ని, ఆవశ్యకతను, సమాజానికి వాటిని ఉపయోగించుకునే విధానం వంటి విషయాలపై ఒక గంటసేపు ప్రసంగించాను. అంతా సంతోషించారు. అంతకు ముందు నేను ఎప్పుడూ చూడని వ్యక్తి నా వద్దకు వచ్చి, ‘తానొక వ్యాపారస్తుడనని, ధర్మ ప్రచారానికి ఉపయోగించమని’ కోరుతూ నా చేతిలో ఒక కవరు ఉంచాడు.
అం దులో ఏముందో తెలుసుకోవాలనే ఆరాటం ఉన్నప్పటికీ దాన్ని అక్కడ విప్పలేదు. సాధారణంగా నేను పాల్గొనే సభలలో నా సొంత రచనల పుస్తకాలను సాహిత్యకారులకు పంచుతాను కూడా. చాలావరకు డబ్బులు తీసుకోకుండానే నా పుస్తకాలను ఇవ్వడమనేది ఒక అలవాటుగా పెట్టుకున్నాను.
ఎవ్వరూ, ఎంత మంచి పుస్తకమైనా డబ్బు ఇచ్చి కొని చదవలేని కాలమిది. కాబట్టి, అది మంచి పుస్తకమైనప్పుడు మనం ఉచితంగా ఇస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. ‘మంచి పుస్తకం మంచి స్నేహితుని వంటిద’ని అంటారు పెద్దలు. కానీ, నేను మంచి పుస్తకాన్ని ఇతరులతో చదివించే వ్యక్తియే మంచి స్నేహితుడని భావిస్తాను. సాధారణంగా నా పుస్తకం వె నుక నా రచనల వివరాలు ఉంటాయి.
అ చ్చు కాబోయే పుస్తకం పేరు కూడా రా స్తాను. త్వరలో ‘సంపూర్ణ యోగ దర్శనం’ అచ్చుకాబోతున్నదనే విషయం నేను పం చిన ఆనాటి పుస్తకాల్లో ఉంది. బహుశా నాకు కవరు ఇచ్చిన పెద్ద మనిషి ఆ వాక్యాన్ని చదివినట్లు తర్వాత నాకు అర్థమైంది.
ఇంటికి వచ్చిన తర్వాత ఆసక్తితో కవరు విప్పి చూశాను. అందులో ఒక లక్ష రూపాయల చెక్కు ఉంది. ఇచ్చిన వారి ఫోను నంబరుకూడా ఉంది. ఆలస్యం చేయకుండా నేను ఆ నంబరుకు ఫోను చేశాను. ఆ అపరిచిత వ్యక్తి పేరు రామకృష్ణ గుప్త. ‘తాను వేద ప్రియుడనని, నా ప్రసంగం ఆద్యంతం వారిని ఆనంద పరిచిందని, త్వరలో వెలువడుతున్న సంపూర్ణ యోగ దర్శనం గ్రంథ ప్రచురణకు లక్ష రూపాయలు విరాళంగా ఇస్తున్నానని, ఇది తన ఇష్టపూర్వకంగా చేస్తున్న పని’ అని చెప్పారు.
‘నేను సభలో పుస్తకాలను అందరికీ ఉచితంగా పంచడం తనను ఆకర్షించదనీ’ తెలిపాడు. సమాధానంగా వారితో నేను ఫోనులో “నా దగ్గర డబ్బుందండీ. మీకెందుకండీ ఇంత శ్రమా?” అన్నాను కూడా. కానీ, ఆయన చెప్పిన సమాధానం నన్ను మరి మాట్లాడనివ్వలేదు. “జ్ఞానాన్ని డబ్బుతో కొలువ లేను సార్. కానీ, డబ్బు లేకపోతే ఒక పుస్తకం తయారు కాదుకదా. మీరు ఈ డబ్బును పుస్తక ప్రచురణకు ఉపయోగించి పదిమందికి పుస్తకాలను పంచితే నేనెంతో సంతోషిస్తాను..” అన్నాడు. అప్పుడు నాకు పండిత గోపదేవ గురువులే గుర్తుకు వచ్చారు. ‘నిష్కామకర్మ ఫలమంటే’ ఇలాగే ఉంటుందని అనిపించింది.
-వ్యాసకర్త సెల్: 9885654381